అభ్యర్థిని ఎంపిక చేసిన 48 గంటల్లోపు క్రిమినల్ రికార్డులను బయటపెట్టాలి..
రాజకీయ పార్టీలకు సుప్రీం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలోని రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థిని ఎంపిక చేసిన 48 గంటల్లోపు ఆ అభ్యర్థికి సంబంధించిన క్రిమినల్ రికార్డులను బయటపెట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరి 13వ తేదీన ఇచ్చిన తీర్పులో మార్పులు చేసినట్టు పేర్కొంది. గతంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన తీర్పు ప్రకారం.. సదరు అభ్యర్థే తమ ఎంపిక పూర్తయిన 48 గంటల్లోపు లేదంటే నామినేషన్ పత్రాలు వేసే తొలి తేదీకి 2 వారాల ముందు తమపై ఉన్న క్రిమినల్ రికార్డులను బయటపెట్టాలి. అయితే ఇప్పుడా ఆదేశాలకు మార్పులు చేస్తూ.. ఆయా పార్టీలే తమ అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను బయటపెట్టాల్సిందిగా సుప్రీం ధర్మాసనం స్పష్టంచేసింది. తమ అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను బయటపెట్టని పార్టీల గుర్తులను రద్దు చేయాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. తమ అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను బయటపెట్టని పార్టీల గుర్తులను రద్దు చేయాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.