AP: అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు

అమరావతి(CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ ఆంక్ష‌లు అమ‌లు చేయాల‌ని రాష్ట్ర స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. కోవిడ్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో తాడేప‌ల్లి లోని క్యాంపు కార్యాల‌యంలో మంత్రులు, ఉన్నతాధికారుల‌తో సిఎం జ‌గ‌న్ సమీక్ష నిర్వ‌హించారు.

స‌మీక్ష అనంత‌రం కర్ఫ్యూ పై ముఖ్య‌మంత్రి కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సడలింపులు ఇచ్చారు. రాత్రి 9 గంటలకల్లా దుకాణాల మూసివేత, 10 గంటల తర్వాత కర్ఫ్యూ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది.

రాత్రి 9 గంట‌ల‌కు దుకాణాలు మూత ప‌డాల‌ని.. నిబంధ‌న‌లు పాటించ‌ని దుకాణాల‌ను 2-3 రోజులు మూసివేయాల‌ని స‌ర్కార్ ఆదేశించింది. నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌పై ఫొటో తీసి పంపినా జరిమానాలు విధించాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ ఫొటోలు పంపేందుకు ప్ర‌త్యేక వాట్సాప్ నెంబ‌ర్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపంది.

కోవిడ్‌ నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం చేపట్టిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాస్క్‌ ధరించకపోతే రూ.100ల జరిమానా కచ్చితంగా అమలు చేసేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. దుకాణాల్లో కూడా సిబ్బంది దగ్గర నుంచి వినియోగదారులకు వరకూ మాస్క్‌లు ధరించాల్సిందేన‌ని ప్రభుత్వం ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.