దళితబంధు రాష్ట్రమంతా అమలు చేయరెందుకు?: రేవంత్ రెడ్డి
ఇంద్రవెల్లి (CLiC2NEWS): తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీ ల జీవితాలు చితికిపోతున్నాయని, ఆదివాసీల జీవితాలు మార్చాలనేదే కాంగ్రెస్ ప్రణాళిక అని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత, గిరిజన దండోరా బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. స్వేచ్ఛ కోసం పోరాడి, ప్రాణాలు ఇచ్చిన నేల ఇంద్రవెల్లి అని రేవంత్ అన్నారు. ఇంద్రవెల్లి పేరు స్మరిస్తే ఎంతో స్ఫూర్తి రగులుతుందని ఆయన అన్నారు. స్వేచ్ఛ కోసం పోరాడి, ప్రాణాలు ఇచ్చిన నేల ఇంద్రవెల్లి అని ఆయన గుర్తు చేశారు. నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుమురం భీం పోరాడారని రేవంత్ స్పష్టం చేశారు. ఒకప్పుడు ఆదిలాబాద్ పేరు చెపితే పోరాట యోధులు గుర్తుకు వచ్చేవారని… ఇప్పుడేమో కేసీఆర్ అడుగులకు మడుగులొత్తే నేతలు గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఎన్నికల కోసమే పథకాలు తెచ్చానని సీఎం ఒప్పుకున్నారని చెప్పారు. ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్‌కు ఎస్సీలు గుర్తుకు వచ్చారని… దళితబంధును అన్ని నియోజకవర్గాల్లో ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. రూ.4 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. కాంట్రాక్టులు, కమీషన్ల ద్వారా వేల కోట్లను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు.
సోనియా గాంధీ ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ ఇచ్చిందో… ఆ ఆకాంక్షలు కేసీఆర్ పాలనలో నెరవేరలేదని రేవంత్ అన్నారు.
రాష్ట్ర ఖజానాను సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తోందని ఆయన అన్నారు. ప్రజలను పక్కదోవ పట్టిస్తూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని భట్టి విమర్శించారు.