సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం: మరో 4 మండలాల్లో దళిత బంధు అమలు
హైదరాబాద్ (CLiC2NEWS): దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకాన్ని ఇక రాష్ట్రవ్యాప్తం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దళితబంధు పథకం అమలు యొక్క లోతుపాతులను, దళిత ప్రజల యొక్క మనోభావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో వున్న, దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు దళితబంధును అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
ఆ నాలుగు మండలాలు..
- చింతకాని మండలం (మధిర నియోజకవర్గం, ఖమ్మం జిల్లా )
- తిరుమలగిరి మండలం (తుంగతుర్తి నియోజకవర్గం, సూర్యాపేట జిల్లా )
- చారగొండ మండలం (అచ్చంపేట నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ జిల్లా )
- నిజాం సాగర్ మండలం (జుక్కల్ నియోజకవర్గం, కామారెడ్డి జిల్లా )
పైన పేర్కొన్న ఈ నాలుగు మండలాల్లో వున్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేస్తుంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్‌లో సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయనున్నారు.