దస్ర దస్రనే నువ్వు నూరు జెప్పు!

బతుకమ్మ ఆడోళ్లదైతే… దస్ర మా మొగోల్లది

కొత్త బట్టలు కుట్టిత్తే… ఆడి పిల్ల‌గాండ్ల కైతే సద్దుల నాడు

మొగ పోరగాండ్లకైతే… దస్ర నాడు తొడుగుతరు

ఎవడన్నా పొరపాటున మొగ పోర‌డు సద్దుల నాడు కొత్త బట్టలు తొడుక్కుంటే

ఇగ వాణ్ని పేర్ల వెట్టనోళ్లే పాపాత్ములు పో…

సద్దుల నాడు అక్క జెల్లెండ్లెళ్లంతా బతుకమ్మ ఆడుతంటే

ఇగ మేము ఆ రోజుల‌ళ్ల‌ సిన్నదో పిస్తోలు కొనుక్కొని

అండ్ల టాపాక రీలు ఎక్కిచ్చుకొని… ఇగ తుట్క తుట్క ఏగిచ్ఛుకుంట

అక్క జెల్లెండ్లెను బయపెట్టిచ్ఛుడు.

గా కతలే వేరు, గా లెక్కలే వేరు… అసలు గా రోజులే వేరు!

కొంచెం పెద్దవెరిగినంక

షేర్ పటాకలు, లచ్చింబాంబులు ఆ లెక్క‌నే వేరు అబ్బో !

మా మోకా అంత బతుకమ్మ నాడే!

స‌ద్దుల‌బ‌తుక‌మ్మ నాడు మా అక్క‌లు సత్తుపిండి కలిపేది కలుపంగనే

ఎన్ని సార్ల బుక్కుకుంట తిట్లు తింటినో..!

గిప్పుడు వాళ్లు ఎంత మెచ్చుకుంటున్నా

ఆ తిట్లల్ల ఉన్నంత ప్రేమ ఏడ కనవడుత లేదు !

ఇగ దస్ర నాడు… గోదారి ఒడ్డున గిడికాడ‌..

ఒక జంబి చెట్టు ఉండేది…

ఊళ్లే మొగోళ్లు.. పిల్ల‌గాండ్లు..

దప్పుల సప్పుడుతోటి మ‌స్తు మంది జంబి కాడికి పోతరు.

ఇగ ఆళ్ళెంబడి జంబి కాడికి

కొత్త‌బ‌ట్ట‌లేసుకుని పోయినమంటె

ఇగ మేంగూడ పెద్దోళ్ల మైనంత ఫీలింగుండేది..!

మొదలు జంబి కింద

పంతులుతో పాటు ఊళ్లే పెద్ద మనుషులు పూజలు చేస్తరు.

కని గంత ఓపికుంటదా మనోళ్లకు

పూజ సగమన్న కాకముందే

ఎగవడుతరు జంబాకు ఆకు తెంపుటానికి!

తెంపక ముందు ఆకు,

తెంపినంక బంగారం

ఇగ గప్పుడు కనవడుతది.. దస్రల ఉన్న మజా!

చిన్నోళ్లు పెద్దోళ్లకు.. అంద‌రికీ ఆకు వెట్టుడు

అలై బలై తీసుకునుడు..

ఎప్పుడు మాట్లాలేనోళ్ళు కూడా ఆనాడు

వరుసల్ని బట్టి ప్రేమలు, గౌరవాలు, పరాష్కాలు

ఇచ్చి పుచ్చుకునుడే

అబ్బబ్బ శెప్పలేం ఆ మురిపెం!

ఇగ కొత్త అల్లుండ్లైతే

ఆ రోజు టక్కేసి టిక్ టాక్ తయారై

ఓ పక్కకు అట్ల నిలుసుంటరు

బామ్మర్ది వరుసయెటోళ్లందరూ

పొయ్యి జంబాకు వెట్టి దండం బెడుతరు.

దోస్తులు, దావతులు, మజాకులు

అసల్ దస్ర దస్రనే నువ్వు నూరు జెప్పు!

ఎన్ని పండుగలకు ఎక్కడున్నా

దస్రకు మాత్రం ఊరికి పోతెనే గమ్మతి!

ఇప్పుడు యాటింత యాటింత బతుకమ్మ మార్తంది

కానీ మా దస్ర మార్తలే!

ఇంకా గదే పచ్చి వాసన !

తెలంగాణా సంస్కృతి అంటే ఏంటిదో

నీకు అర్థం కాకపోతే దస్ర నాడు

మా ఊరి గుడికాడికి రా బరాబర్ సూపెడ్త!

(ఇందులో 1990 నుండి 2000ల మ‌ధ్య‌న జ‌రిగిన నా అనుభూతులైతే మ‌స్తు ఉన్నయి. ఇలాంటివే మీ అనుభూతులు కూడా ఉండే ఉంటయి గ‌దా….. పొడి బారిన గుండెలను తడి చేసుకోవడానికే ఈ నా యాదులు…. పెద్దగ ఉన్నా గాని సదివినందుకు మీ షనార్తులు)

1 Comment
  1. Sagar says

    Super

Leave A Reply

Your email address will not be published.