మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడిన ఘటన.. 27కి చేరిన మృతుల సంఖ్య
రాయ్‌గఢ్ (CLiC2NEWS): మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 27 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 57 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని అధికారులు చెబుతున్నారు. రాయ్‌గఢ్ జిల్లాలో కొండ ప్రాంతమైన ఇర్షల్ వాడీలో బుధవారం రాత్రి కొండచరియలు విరగిపడటంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 27 మంది మృత్యువాతపడ్డారు. ఈఘటనలో గల్లంతైన వారికోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నాలుగు రోజుల నుండి సహాయక చర్యలు జరుగుతుండగా.. ఆదివారం చేపట్టిన ఆపరేషన్‌లో మృతదేహాలు బయటపడలేదని మంత్రి ఉదయ్ సమంత్ తెలిపారు. దీంతో జిల్లా అధికారులు, సహాయక సిబ్బంది, గ్రామస్థులతో చర్చించి.. సహాయక చర్యలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ఘటనా స్థలంలో మృతదేహాలు, జంతువులు కుళ్లిపోవడంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తోందని అధికారులు తెలిపారు.
ఇర్షల్ వాడీ గ్రామంలో 17 ఇళ్లు కొండచరియల విరిగిపడటం వలన ధ్వంసమయ్యాయి. అక్కడ మొత్తం 48 ఇళ్లు ఉన్నాయి. 111 మందిని సహాయక సిబ్బంది కాపాడారు.