ఢిల్లీ సిఎం కేజ్రివాల్ అరెస్టు..
ఢిల్లీ (CLiC2NEWS): మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌ను ఇడి అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు కేజ్రివాల్‌కు సమన్లు పంపినా.. ఆయన హాజరుకాలేదు. మరోవైపు ఈ కేసులో కేజ్రివాల్‌కు ఢిల్లీ హైకోర్టులో కూడా ఊరట లభించలేదు. గురువారం సాయంత్రం దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఇడి బృందం అరవింద్ కేజ్రివాల్ నివాసానికి చేరుకుని విచారించింది. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకుంది.
సిఎం నివాసానికి ఆప్ నేతలు, పెద్ద సంఖ్యలో ఆప్ కార్యకర్తలు తరలివచ్చి ఆందోళన చేపట్టారు. కేజ్రివాల్ అరెస్టయినప్పటికీ ఆయన సిఎంగా కొనసాగుతారని ఢిల్లీ మంత్రి అతిషీ స్పష్టం చేసినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల ముందు ఈ అరెస్టులు పెద్ద కుట్రేనని ఎంపి రాఘవ్ చద్దా అన్నారు. ఎన్నికల ముందు కేజ్రివాల్ గొంతు అణిచివేసేందుకే ఆయన్ని అరెస్టు చేయాలని చూస్తున్నారని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాం నివాస్ గోయెల్ విమర్శించారు.