Delhi: మరో అంజలిని అయ్యేదాన్ని.. స్వాతి మలివాల్

ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా మహిళా కమిషన్ ఛైర్పర్సన్కే రక్షణలేకుండా పోయింది. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్తో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించి.. అనంతరం 10,15 మీటర్ల మేర కారుతో ఈడ్చుకెళ్లాడు. ఢిల్లీలో మహిళల భద్రతను పరిశీలించేందుకు అర్ధరాత్రి బయటకు వచ్చిన ఆమెపై ఈ దారుణం జరిగింది. ఇటీవల అంజలి అనే యువతిని కారుతో ఢీకట్టి.. కారుతో ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ యువతి తీవ్ర గాయాలతో మృతిచెందింది. ఈ ఘటన తర్వాత నగరంలో పరిస్థితులను పరిశీలించేందుకు వచ్చిన మలివాల్ ఈ ఘటన ఎదురైంది. కారుతో ఈడ్చుకెళుతున్న సమయంలో గట్టిగా అరవడంతో విడిచిపెట్టినట్లు తెలిపారు. లేకపోతే తనకుకూడా అంజలి పరిస్థితి వచ్చేదని.. ఆమె సోషల్ మీడియా వేదికగా వివరించారు.
ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఇనిస్టిట్యూట్ వద్ద గురువారం వేకువజామున 3గంటలకు ఎయిమ్స్ రెండవ గేటు వద్ద
కారులో వచ్చిన వ్యక్తి ఆమెను కారులో ఎక్కాలని ఒత్తిడిచేశాడు. ఆమె నిరాకరించడంతో.. వెళ్లిపోయి, మరల తిరిగివచ్చాడు. సైగలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేశాడు. దీంతో మలివాల్ కారు డోర్ వద్దకు వెళ్లి అతనిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. కారు అద్దాలు పైకి వేశాడు. దీంతో ఆమె చేతులు ఇరుక్కుపోయాయి. నిందితుడు ఆమెను 15 మీటర్ల మేర ఈడ్చుకుంటూ వెళ్లాడు. దేవుడే నన్ను కాపాడాడు. దేశ రాజధానిలో మహిళా కమిషన్ ఛైర్పర్సనే సురక్షితంగా లేరంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోండి అని స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు హరీశ్ చంద్రను పోలీసులు అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు.