TS: కొత్త లేఅవుట్‌లను అనుమతించొద్దు: ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): కలెక్టర్ల అనుమతి లేకుండా కొత్త లేఅవుట్‌లను అనుమతించొద్దు అని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. కొత్త చట్టాల్లోని నిబంధనలను విధిగా అమలు పరచాలని ఆదేశించారు. ప్రగతి భవన్‌లో పట్టణ ప్రగతిపై అధికారులతో శనివారం సిఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ..
పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణాల వారీగా క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పట్టణప్రగతి కార్యాచరణపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో అన్ని శాఖలకు చెందిన విశ్రాంత ఉద్యోగులు, మాజీ సైనికుల జాబితా తయారు చేయాలని పేర్కొన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో వారి సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. జులై చివరి నాటికి ప్రభుత్వ శాఖల మధ్య పేరుకుపోయిన బకాయిలను బుక్ అడ్జస్ట్‌మెంట్ ద్వారా పరిష్కరించాలి. ఇకపై అన్ని శాఖల మధ్య వెంట వెంటనే బిల్లుల చెల్లింపులు జరగాలని చెప్పారు. తెలంగాణ పట్టణాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రతి పట్టణంలో కనీసం ఐదు డంపు యార్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పట్టణాలకు దగ్గరలో డంప్ యార్డులకు స్థలాలు సేకరించాలని సూచించారు.
కొత్తగా నిర్మిస్తున్న సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు తరలుతున్న ప్రభుత్వ కార్యాలయాల స్థలాలు, ఆస్తులను జిల్లా కలెక్టర్ స్వాధీనం చేసుకోవాలని సీఎం చెప్పారు. ఆ స్థలాలను ప్రజా అవసరాల కోసం వినియోగించాలని సూచించారు. లక్ష జనాభాకు ఒకటి చొప్పున కనీసం 3 ఎకరాల స్థలంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్మించి పార్కింగ్, తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. పట్టణాలను తీర్చిదిద్దుకునేందుకు 10 రోజుల సమయాన్ని సమర్థవంతంగా అధికారులు వినియోగించుకోవాలి అని సిఎం ఆదేశించారు.