`ఒమిక్రాన్`పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు : డిహెచ్ శ్రీనివాసరావు

హైదరాబాద్ (CLiC2NEWS): కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల నమోదుపై అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. భారత్‌లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. కొత్త రకమైనకేసులు వస్తే ప్రభుత్వం నేరుగా ప్రకటిస్తుందని తెలిపారు. ఇందులో ఎలాంటి దాపరికం కానీ, దాచాల్సిన అవసరం లేదన్నారు. ఎయిర్‌పోర్టుల్లో నిఘాను బలోపేతం చేశామన్నారు. రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ అధికారులను సిఎం కెసిఆర్ ఎప్పటికప్పుడు అప్రమత్తం ఏస్తున్నారని డిహెచ్ తెలిపారు.
ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో కేంద్ర సర్కార్ ఇప్పటికే 12 దేశాలను ఎట్ రిస్క్ కంట్రీస్‌గా గుర్తించిందని తెలిపారు. ఆయా దేశాల నుంచి ప్రయాణికులందరికీ కూడా ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రతి ఒక్కరికీ ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేస్తామన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులను గచ్చిబౌలిలోని టిమ్స్ ఐసోలేషన్ సెంటర్‌కు తరలించి,చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ఒమిక్రాన్ కేసులు గుర్తించిన 12 దేశాల నుంచి 40 మందికిపైగా రాష్ట్రానికి వచ్చారని, వారందరికీ నెగటివ్ రావడంతోనే హోం క్వారంటైన్‌కు పంపామని ఆయన తెలిపారు. రాబోయే 14 రోజులు వారి ఆరోగ్యాన్ని హెల్త్ కేర్ సిబ్బంది పరిశీలిస్తారని, ఎవరికైనా లక్షణాలు ఉంటే వారితో పాటు కాంటాక్టులకు పరీక్షలు చేస్తామన్నారు. ఎన్ని మ్యూటేషన్లు వచ్చినా కొవిడ్ నిబంధనలను పాటిస్తే మనల్ని మనం కాపాడుకోవచ్చన్నారు.