గోద్రా రైలు ద‌హ‌నం కేసు దోషుల‌కు బెయిల్ ఇవ్వొద్ద‌న్న గుజ‌రాత్ స‌ర్కార్‌!

ఢిల్లీ (CLiC2NEWS): గోద్రా రైలు ద‌హ‌నం కేసులోని కొంద‌రు దోషులు త‌మ‌కు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఉన్న‌త న్యాయ‌స్థానంలో పిటిష‌న్‌ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్ల‌ను గుజ‌రాత్ ప్ర‌భుత్వం వ్య‌తిరేకించింది. వారు రాళ్ల దాడికి పాల్ప‌డ‌టం కార‌ణంగా మంటల్లో చిక్కుకున్న కోచ్ నుండి ప్ర‌యాణికులు త‌ప్పించుకోలేక‌ ప్రాణాలు కోల్పోయార‌ని ప్ర‌భుత్వ‌పు న్యాయ‌వాది కోర్టుకు విన్న‌వించారు. 2002 ఫిబ్ర‌వ‌రి 27న గోద్రా రైల్వేస్టేష‌న్లో స‌బ‌ర్మ‌తి ఎక్స్‌ప్రెస్ రైలు ప్ర‌మాదంలో 59 మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిన‌దే. ఈ కేసులో శిక్ష‌ను అనుభ‌విస్తున్న దోషులు బెయిల్ కోర‌గా సుప్రీంకోర్టు సిజెఐ జ‌స్టిస్ డి వై చంద్ర‌చూడ్, జ‌స్టిస్ పి ఎస్ న‌ర‌సింహ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది.

గోద్రా రైలు ఘ‌ట‌న కేసులోని దోషులు ఇప్ప‌టికే 17-18 ఏళ్లు జైలు శిక్ష అనుభ‌వించినందున వారి పిటిష‌న్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌చ్చ‌ని, వారి వ్యక్తిగ‌త పాత్ర‌ల‌ను పేర్కొన‌వ‌ల‌సిందిగా రాష్ట్రాన్ని కోరింది. వారు చేసింది సాధార‌ణ రాళ్ల దాడి కాద‌ని.. దానివల్ల బోగీలోని ప్ర‌యాణికులు బ‌య‌ట‌కు రాలేక‌పోయార‌ని రాష్ట్ర సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్‌ తుషార్ మెహ‌తా వాద‌న‌లు కోర్టుకు వివ‌రించారు. అంతే కాకుండా వారి పిటిష‌న్లు గుజ‌రాత్ హైకోర్టు తీర్పున‌కు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌న్నారు. గుజ‌రాత్ హైకోర్టు 11 మందికి దోషులకు విధించిన మ‌ర‌ణ శిక్ష‌ను యావ‌జ్జీవ కారాగార శిక్ష‌గా మార్చింద‌ని తెలిపారు. వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం దోషుల వ్య‌క్తిగ‌త పాత్ర‌ల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను తెల‌పాల్సిందిగా ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.త‌దుప‌రి విచార‌ణ‌ను డిసెంబ‌ర్ 15కి వాయిదా వేసింది

Leave A Reply

Your email address will not be published.