ఏలూరు: సిజేరియన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన వైనం..
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/SCISSOR-IN-PETIENT-STOMUCK.jpg)
ఏలూరు (CLiC2NEWS): ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళకు వైద్యులు సిజేరియన్ చేసి బిడ్డను తీశారు. కానీ కత్తెరను కడుపులోనే ఉంచి కుట్లు వేశారు. ఈ ఘటన ఏలూరు బోధనాసుపత్రిలో చోటుచేసుకుంది. ఏప్రిల్ 19 వతేదీన పెదపాడుకు చెందిన మహిళ ఏలూరు బోధనాస్పత్రిలో సిజేరియన్ చేశారు. కడుపులో కత్తెరను మరిచిపోయారు. డిశ్చార్జి అయిన అనంతరం ఆమె ఇంటికి వెళ్లిపోయింది. ఆమెకు తరచూ కడుపులో నొప్పి వస్తూండేది. సాధారణంగా వచ్చేదే అనుకొని మందులు వాడుతుండేది. ఈ నెల 8వ తేదీన విపరీతంగా కడుపునొప్పి రావడంతో తిరిగి అదే ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి విజయవాడ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ విచారణ కమిటి వేసినట్లు సమాచారం.