ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్మూ
న్యూఢిల్లీ (CLIC2NEWS): అధికార పక్షం ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఆదివాసి మహిళ ద్రౌపది ముర్మూ ఎంపికయ్యారు. మంగళవారం రాత్రి బిజెపి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రాత్రి 7.30 నుండి 9.15 వరకు జరిగిన ఈ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ పలువురు రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించారు. చివరకు ద్రౌపది ముర్మూను ఖరారు చేశారు. సమావేశం అనంతరం ఈ విషయాన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రకటించారు.
ఝార్ఖండ్ గవర్నర్‌గా పనిచేసిన ముర్మూ 1958 జూన్ 20న ఓడిశాలోని మయార్‌భంజ్ జిల్లా బైడాపోసి గ్రామంలో జన్మించారు. గతంలో ముర్మూ ఒడిషా రాష్ట్రంలో బిజెపి, బిజద సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. బిజెపి అధిష్ఠానం పూర్తిగా సామాజిక కోణంలోనే ఆమె ఎంపికకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. 2007 నుండి 2012 వరకు భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ ఉన్నారు. అధికార పార్టీ తరపున రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న రెండో మహిళ ముర్మూ అవుతారు.