ప్రకృతి విలయం.. రెండు దేశాలు అతలాకుతలం..

అంకారా (CLiC2NEWS): సోమవారం సంభవించిన భూకంపం .. రెండు రోజులైనా శిథిలాల కింద గుట్టలకొద్ది మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. సిరియా టర్కీ దేశాలలో ప్రకృతి విలయతాండవం చేసింది. ఏకంగా 200 ల సార్లు భూప్రకంపనలు సంభవించాయి. దీంతో వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. భారీగా ప్రాణ నష్టం సంభవించింది. భవనాల శిథిలాల కింద చిక్కుకు పోయి.. అనేక మంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరుసగా సంభవిస్తున్న భూక్రంపనలు కారణంగా సహాయక చర్యలకు సైతం ఆటంకం కలుగుతోంది. ఈ రెండు దేశాల్లో సుమారు 200 సార్లు భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రజలంతా భయభ్రాంతులతో బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆ హృదయ విదారక దృశ్యాలను టీవీల్లో చూస్తుంటే హృదయం ద్రవించిపోతుంది. కళ్లు చెమరుస్తున్నాయి.
ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఆరెండు దేశాలవైపే చూస్తున్నాయి. ప్రకృతి ప్రళయానికి బలైన టర్కీ సిరియా దేశాల్లో మృతుల సంఖ్య పెరుగుతుంది. వేల సంఖ్యలో భవనాలు కుప్పకూలిపోయాయి. భవన శిథిలాల కింద లక్షల్లో ప్రజలు చిక్కుకుపోయారు.
ఒక తుర్కియోలోనే 6000 భవనాలు కుప్పకూలిపోయాయి. సుమారు 1,80,000 మంది ఆ భవన శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అంచానా వేస్తున్నారు. అయితే వారిని సజీవంగా బయటకు తీసేందుకు సహాయక బృందాలు సాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. తుర్కియో, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం వలన సుమారు 20 వేలకు పైగా మృతి చెంది ఉంటారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనా వేసింది. ఆ రెండు దేశాలకు సాయం చేసేందుకు భారత్ సైతం ముందుకు వచ్చింది.