భారీ వర్షాల ఎఫెక్ట్.. ఇసెట్ పరీక్ష వాయిదా: ఉన్నత విద్యామండలి
ఒయు, కెయు పరిధిలో పలు పరీక్షలు వాయిదా

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సర్కార్ సోమ, మంగళ, బుధవారాలు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వర్షాల నేపథ్యంలో బుధవారం జరగాల్సిన ఇసెట్ పరీక్ష వాయిదా వేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ నెల 14వ తేదీన ఎంసెట్ యథాతథంగా కొనసాగుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై కన్వీనర్లు, ఇతర ఉన్నతాధికారులతో చైర్మన్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 13వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పాటు.. పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నందున ఇసెట్ వాయిదా వేయాలని నిర్ణయించారు. ఇసెట్ పరీక్షను మల్లీ ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్ని త్వరలో ఖరారు చేస్తామని లింబాద్రి తెలిపారు. ఈనెల 14,15వ తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, 18 నుంచి 20 వరకు జరిగే ఇంజినీరింగ్ ఎంసెట్ యథాతథంగా ఉంటుందని.. వాటి షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మూలంగా సోమ, మంగళ, బుధవారాలలో కాకతీయ వర్సిటీ పరిధిలో జరగాల్సి పలు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని రిజిస్ట్రార్ ప్రకటించారు.
అలాగే ఉస్మానియా వర్సిటీ కూడా నేటి నుంచి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. దీంతో సోమ, మంగళ, బుధవారాలలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఈ నెల 14 నుంచి జరగాల్సిన పరీక్షలుయథాతథంగా ఉంటయని అధికారులు తెలిపారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తామని చెప్పారు.