రెండో రోజు పరీక్ష పేపర్ వాట్సాప్‌లో దర్శనం

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర వ్యాప్తంగా పదవతరగతి పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి రోజు తెలుగు పరీక్ష మొదలైన 5-7 నిమిషాలలోపే తెలుగు పేపర్ వాట్సాప్‌లో దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన నులుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. రెండో రోజుకూడా ఇదే పరపర కొనసాగుతోంది. రెండో రోజు పదవ తరగతి హిందీ ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో లీకవడం కలకలం రేపుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేపర్ లీకైనట్లు తెలుస్తోంద. వాట్సాప్‌లో వైరల్ అయిన పేపర్ ఇవాల్టి పరీక్ష పత్రంలో సరిపోలిందని వరంగల్ డిఇఒ వాసంతి తెలిపారు. అయితే ప్రశ్నాపత్రం ఎక్కడినుండి బయటకు వచ్చిందనేది తెలియలేదు.
ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో వైరల్ కావడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆరా తీశారు. దీని గురించి వరంగల్, హనుమకొండ డిఇఒలతో మాట్లాడారు. వరంగల్ సిపికి ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల విషయంలో జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు , పోలీసులు సమన్వయంతో పనిచేయలని మంత్రి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ బాధ్యగా వ్యవహరించాలన్నారు. విద్యార్థులను గందరగోళానికి గురిచేయాలని ఎవరు ప్రయత్నించినా.. కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.