అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి
అచ్యుతాపురం (CLiC2NEWS): ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. మరో 50 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. బుధవారం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియ అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. రియాక్టర్ పేలడంతో భారీ శబ్ధం, దట్టంగా ఒకేసారి పొగలు కమ్ముకున్నాయి . కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. మొత్తం 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో 300 మంది కార్మాకులు విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
అచ్యుతాపురం సెజ్ ఘటనపై సిఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఘటనాస్థలిలో కలెక్టర్ , ఎస్‌పి పరిస్థితి సమీక్షిస్తున్నారు.