నీటివాటా కోసం కేంద్రాన్ని నిలదీయండి

హైదరాబాద్ (CLiC2NEWS): సాగునీటి విషయంలో తెలంగాణకు ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వకూడదని, రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాకోసం పార్లమెంటు సమావేశాల్లో గట్టిగా పోరాడాలని సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపిలకు సూచించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన శుక్రవారం ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తావించాల్సిన తెలంగాణ అంశాలు, సమస్యలపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు.
అంతకుముందు కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ గెజిట్ల న్యాయపరమైన అంశాలపై అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌తో చర్చించారు. ఇదే విషయంలో సాగునీటిరంగ నిపుణులతో సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు.

పార్లమెంట్ ఉభయసభల్లో సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా కోసం నిలదీయాలని, గట్టిగా కొట్లాడాలని సూచించారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ సహా అన్ని హామీలపై సంబంధిత కేంద్రమంత్రులను కలిసి వినతిపత్రాలును అందజేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో సమావేశంలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సంతోష్‌కుమార్, కేఆర్ సురేశ్‌రెడ్డి, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్, లోక్‌సభ సభ్యులు బీబీ పాటిల్, పోతుగంటి రాములు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్, బీ వెంకటేశ్ నేతకాని, మన్నె శ్రీనివాస్‌రెడ్డి తో పాటు మంత్రి మంత్రి గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.