బస్సులో మంటలు.. 8 మంది సజీవ దహనం!
కలబురిగి (CLiC2NEWS): కర్ణాటకలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కలబురిగి జిల్లా కమలాపురలో మినీ లారీని ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సు బలంగా ఢీ కొట్టి పక్కనే ఉన్న గుంతలో బో్ల్తా పడింది. ఈ క్రమంలో భారీగా మంటలు చెలరేగడంతో.. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంలో మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి కలబురిగి జిల్లాలోని ఆసుపత్రికి తరలించారు. మూడు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషయమంగా ఉన్నదని తెలిసింది.
ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన అర్జున్ కుమార్ (37), అతని భార్య(32), బినాన్ (4), దీక్షిత్ (8), అనితా రాజు (40), శివకుమార్ (35), రవలి (30) మరొకరు ఉన్నట్లు గుర్తించారు.
ప్రమాద సమయంలో బస్సులు మొత్తం 35 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇవాళ (శుక్రవారం) ఉదయం 6.30 సమయంలో బీదర్ -శ్రీరంగపట్నం హైవేపై కమలాపుర సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు.
పుట్టిన రోజు వేడుకలకోసం 32 మంది గోవాకు వెళ్లారు. వీరిలో 21 మంది ఒక కుటుంబం, 11 మంది మరో కుంటుంబం. వీరంతా తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.