విమాన యానం

వాషింగ్టన్ డిసి నుంచి మిన్నోసోటాకు
ఆరు నెలలకే అంబరం తాకుతూ ప్రయాణం
నీ తొలి అడుగు విమాన యానంలో
కాలు గడప దాటితే కారు
ఎక్కి తిప్పుతారు అమ్మానాన్నలు
బోసి నవ్వుల నీ కోసం
సకల సదుపాయాలు నీకు
ఇది నీ జీవన శైలి మరి,
గుండెలకు హత్తుకున్నారు అత్తా మామ
నియా,నీ సాన్నిహిత్యంలో మెరిసి, మురిసింది సాన్వీ
కుటుంబాలు రెండు కలిసిన ఆనందం మీది
మా లోటు తెలియని వయస్సులో నీవు
చేరువ లేని మా అంతరంగంలో ఎంతో వెలతి
నా బాల్యం ఎలా ఉందో నీకు చెప్పనా
మారుమూల ప్రాంతం నా జన్మస్థలం
ఊరిలోనే సైకిల్ కూడా లేని దైన్యం
కాలి నడకనే నాన్న అయినా, నేనైనా
ఇంటర్ విద్య వరకు ఎక్కలేదు బస్సు
ఓటు హక్కు వచ్చిన తర్వాతనే కారు ప్రయాణం
స్వంత కారు కాదు సుమా
ఉద్యోగ పర్వంలో అది ఉచిత యానమే మరి
అర్థ శతాబ్దం వరకు నేరుగా నే కనలేదు విమానం
నీ, నా తరం తారతమ్యాలు ఇవి
గడిచింది అరు దశాబ్దాల నా కాలం అలా
ప్రపంచమే నేడు కుగ్రామం అయింది
ఐటి కాలం ఇది అంతా అరచేతిలోనే
ఉజ్వల భవిష్యత్తు నీ ముందు.
-కోనేటి రంగయ్య
సీనియర్ పాత్రికేయులు