తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడం మూర్ఖత్వం: కెసిఆర్
హైదరాబాద్ తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడం మూర్ఖత్వమని మాజి సిఎం కెసిఆర్ అన్నారు. బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ పార్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. డిసెంబర్ 9 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కెసిఆర్ పార్టి నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు రావాలని.. ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని, అంశాలవారీగా ప్రభుత్వాన్ని నిలదీయాన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడం మూర్ఖత్వమని.. ఇలా మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని, ప్రభుత్వాలు చేయాల్సిన పని ఇదేనా అని కెసిఆర్ ప్రశ్నించారు. ఉద్యమంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని వివరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, మూసి, హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరి, గురుకులాలు, విద్యారంగంలో వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. నిర్భంధ పాలన గురించి అసెంబ్లీలో ప్రస్తావించాలని.. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తిచూపాలన్నారు. వచ్చే ఫిబ్రవరి తర్వాత పార్టీలో అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తామన్న ఆయన.. కమిటీ ఏర్పాటు తర్వాత సభ్యత్వ నమోదు ఉంటుందిని తెలిపారు.