శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లా: ప్రధానార్చకులు రమణ దీక్షితులు

తిరుమల (CLiC2NEWS): తిరుమల శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై ఎన్నోసార్లు అధికారులు దృష్టికి తెచ్చినట్లు టిటిడి మాజి ప్రధానార్చకులు రమణ దీక్షితులు తెలిపారు. గతంలో చాలాసార్లు టిటిడి ఛైర్మన్, ఇఒ దృష్టికి తీసుకెళ్లానన్నారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని.. తనది ఒంటరి పోరాటమన్నారు. తోటి అర్చకులెవరూ వారి వ్యక్తిగత కారణాల వలన ముందుకురాలేదన్నారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం అపచారమని ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువల కొవ్వు కలిసిందని వచ్చిన రిపోర్టులపై ఆలయ మాజి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు. నెయ్యి పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు చూశానన్నారు. గత ఐదేళ్లూ మహాపాపం జరిగిపోయిందని.. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలను ప్రక్షాళన చేస్తామని సిఎం అన్నారని.. దానికోసం చర్యలు చేపట్టాలని కోరారు.