యుపి మాజీ సిఎం క‌ల్యాణ్ సింగ్ క‌న్నుమూత‌

ల‌క్నో (CLiC2NEWS): భార‌తీయ జ‌న‌తాపార్టీ సీనియ‌ర్ నేత‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి క‌ల్యాణ్ సింగ్ (89) క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా తీవ్ర‌ అనారోగ్యంతో ల‌ఖ్‌న‌పూర్‌లోని సంజ‌య్ గాంధీ ద‌వాఖాన‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. ఆయ‌న మ‌ర‌ణ వార్త తెలియ‌గానే యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ త‌న ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకుని హుటాహుటిన ల‌క్నోకు చేరుకున్నారు.

త‌న 60 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో ఆయ‌న అనేక కీల‌క ప‌ద‌వులు అలంక‌రించారు. బిజెపి మూల సిధ్దాంతం హిందుత్వ‌ను బ‌లంగా వినిపించారు. 10 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ముఖ్య‌మంత్రిగా, రెండు సార్లు ఎంపీగా, ఎండు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌గా సేవ‌లందించారు.

1932 జ‌న‌వ‌రి ఐదో తేదీన జ‌న్మించిన కల్యాణ్ సింగ్ రెండు సార్లు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎంగా, రెండు సార్లు పార్ల‌మెంట్ స‌భ్యుడిగా ప‌ని చేశారు. 1992 డిసెంబ‌ర్ ఆరో తేదీన‌ అయోధ్య‌లో వివాదాస్ప‌ద బాబ్రీ మ‌సీదు కూల్చివేత స‌మ‌యంలో యూపీ సీఎంగా ఉన్నారు.

1991లో తొలిసారి యూపీ సీఎంగా..

1991లో తొలిసారి యూపీ సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. రెండో ద‌ఫా 1997లో సీఎంగా ప‌ని చేసిన క‌ల్యాణ్ సింగ్‌.. 1999లో పార్టీ నుంచి ఉద్వాస‌న‌కు గుర‌య్యారు. ఆ త‌ర్వాత సొంతంగా పార్టీని స్థాపించారు. తిరిగి 2004లో బీజేపీలో చేరిన క‌ల్యాణ్ సింగ్.. బులంద్ ష‌హ‌ర్ స్థానం నుంచి లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. కానీ 2009లో రెండోసారి బీజేపీని వీడారు. 2009 ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా ఎటా నుంచి పార్ల‌మెంట్‌కు ఎన్నిక‌య్యారు.

2014లో తిరిగి బీజేపీలో చేరిన క‌ల్యాణ్ సింగ్‌ను త‌ర్వాత రాజ‌స్థాన్ గ‌వ‌ర్న‌ర్‌గా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ నియ‌మించారు. ఐదేండ్ల పాటు రాజ‌స్థాన్ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌ని చేసిన క‌ల్యాణ్ సింగ్‌.. 2019లో తిరిగి క్రియా శీల రాజ‌కీయాల్లో ప్ర‌వేశించారు. అదే ఏడాది బాబ్రీ మ‌సీదు కూల్చివేత కుట్ర కేసుపై సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానంలో విచార‌ణ‌ను ఎదుర్కొన్నారు. అయితే 2020లో సీబీఐ ప్ర‌త్యేక కోర్టు ఆయ‌న‌ను నిర్దోషిగా ప్ర‌క‌టించింది.

కల్యాణ్​సింగ్​ మృతిపట్ల ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కల్యాణ్​​ సింగ్​ గొప్ప రాజనీతిజ్ఞుడు మాత్రమే గాక మంచి అడ్మినిస్ట్రేటర్​ అని కొనియాడారు. క్షేత్రస్థాయి రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేసినట్లు తెలిపారు. ఉత్తర్​ప్రదేశ్​ అభివృద్ధి ప్రస్థానంలో కల్యాణ్​ సింగ్​ది కీలక పాత్ర అని పేర్కొన్నారు.

కల్యాణ్​ సింగ్​ మరణవార్త పట్ల ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్పనాయకుడిని, జాతీయవాదిని కోల్పోయిందని అన్నారు. ప్రజాసేవకు అంకితమైన వ్యక్తిగా కల్యాణ్​సింగ్​ను అభివర్ణించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

23న అంత్యక్రియలు

కల్యాణ్​ సింగ్​ అంత్యక్రియలు ఈ నెల 23న ఉత్తర్​ప్రదేశ్ నరోరాలోని​ గంగా నదీ ఒడ్డున జరగనున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ప్రకటించారు. మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్టు, ఆగస్టు 23న సెలవు దినంగా సిఎం ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.