విజయనగరం: కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి

విజయనగరం (CLiC2NEWS): కారు లాక్ పడి అందులో చిక్కుకున్న నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విజయనగరం కంటోన్మెంట్ పరిధిలోని ద్వారపూడి గ్రామంలో చోటుచేసుకుంది. నలుగురు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ కారులో చిక్కుకుపోయారు. ఆడుకోవాడానికి వెళ్లిన చిన్నారులు ఎంతసేపైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. పిల్లలకోసం తల్లిదండ్రులు ఎక్కడ వెతికినా కనపడలేదు. స్థానిక మహిళా మండలి కార్యాలయం వద్ద నలుగురు చిన్నారుల మృతదేహాలను అక్కడున్న స్థానికులు గుర్తించారు.
ఉదయ్, చారుమతి, చిరిష్మా, మనస్వి ఆడుకుంటూ కారులోపలికి వెళ్లగా.. లాక్ పడిపోవడంతో అందులో చిక్కుకుపోయారు. వారికి ఊపిరి ఆడక మృతి చెందినట్లు సమాచారం. మృతి చెందిన వారిలో చారుమతి, చరిష్మా అక్కాచెల్లెళ్లు. ఆదివారం ఆడుకోవడానికని వెళ్లిన తమ పిల్లలు విగతజీవులుగా కనిపించే సరికి తల్లిదండ్రులు కన్నారుమున్నీరుగా విలపిస్తున్నారు. ద్వారపూడిలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.