వెళ్తున్న ఆటో నుంచి జారిపడి నలుగురి మృతి
మార్కాపురం (CLiC2NEWS): ప్రకాశం జిల్లా తుర్లుపాడు-కొనకమిట్ల మండలాల సరిహద్దు కలుజువ్వలపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహం జరిపించేందుకు వధువును ప్రకాశం జిల్లాలోని తర్లుపాడు మండలం సోమేపల్లి నుంచి అక్కచెరువు తీసుకెళ్తుండగా కలుజువ్వలపాడు వద్ద ఈ ఘటన జరిగింది. వధువుకు ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న ఆటో నుంచి జారిపడి నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలంలోనే ఇద్దరు మృతి చెందగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. మృతులను కనకం కార్తీక్, అనిల్, గోగాను సుబ్బారావు, శ్రీనుగా గుర్తించారు.
ఈ ఘటనతో ఆ పెళ్లింట విషాదం నెలకొంది. బంధువులంతా ఈ వార్త విని కుప్పకూలిపోయారు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఉదయం 11 గంటలకు వివాహనం జరగాల్సి ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో పెళ్లింట విషాదం నెలకొంది.