Mancherial: సింగరేణిలో గని పై కప్పు కూలి నలుగురు కార్మికులు దుర్మరణం

మంచిర్యాల (CLiC2NEWS): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఎస్ ఆర్పీ-3 గనిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సింగరేణి గని పైకప్పు కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో గనిలోని 21 డిప్ 24 లెవల్, 3ఎస్‌పీ 2 సీం వద్ద గని పైకప్పు రక్షణ చర్యలు చేపడుతున్న టింబర్‌మెన్ బేర లచ్చయ్య (60), సపోర్ట్‌మెన్ వీ క్రిష్ణారెడ్డి (59), బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహారాజు (30), రెంక చంద్రశేఖర్(30)కార్మికులు బండ కింద కూరుకుపోయి అక్కడికక్కడే మరణించారు.
కాగా సింగరేణి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ శిథిలాలు కావడంతో రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందిగా మారింది. కాగా ప్రమాదంపై సింగరేణి కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రమాదంపై మంత్రులు హరీశ్‌రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
కార్మికులు మృతి చెందడంపై గుర్తింపు కార్మిక సంఘం, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రులు హరీశ్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికుల కుటుంబాలకు టీబీజీకేఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు వెంటనే పరిహారం: సింగరేణి సిఎండి
గని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందడంపై సంస్థ సీఅండ్‌ఎండీ ఎన్ శ్రీధర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై తక్షణమే విచారణ జరిపి నివేదికనివ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.బాధిత కుటుంబాలకు కంపెనీ అండగా ఉంటుందని, కంపెనీ తరపున చెల్లించాల్సిన సొమ్మును తక్షణమే వారి కుటుంబసభ్యులకు అందజేయాలని ఆదేశించారు. భాగంగా కార్మికుల కుటుంబీకుల్లో అర్హులైన ఒకరికి తక్షణమే వారు కోరుకున్న ఏరియాలో ఉద్యోగం కల్పించనున్నామని ప్రకటించారు.