చెరువులో మునిగి నలుగురు యువకులు మృతి
కర్నాటక రాష్ట్రంలోని బీదర్ గోడివాడలో ఘటన
బీదర్ (CLiC2NEWS): కర్ణాటకలోని బీదర్ జిల్లా గోడివాడ దర్గా సమీపంలోని చెరువులో హైదరాబాద్‌కు చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు..

సలీంబాబా నగర్ బస్తీకి చెందిన జునైద్‌ఖాన్ (21), అతని సోదరుడు ఫహాద్‌ఖాన్(16), ఆదే ప్రాంతానికి చెందిన సయ్యద్ జునైద్(16), కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన హైదర్‌ఖాన్ (16)లు ఆదివారం గోడివాడి దర్గాకు వెళ్లారు. దర్గాకు పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసేందుకు యువకులు వెళ్లారు. మొదట హైదర్ స్నానానికి వెళ్లగా అతను నీటిలో మునిగిపోతుండటాన్ని మిగతా ముగ్గురూ గమనించి అతన్ని కాపాడే క్రమంలో వీరంతా నీటిలో మునిగిపోయారు.
వర్షాకాలం కావడంతో ఈ మధ్య కురిసిన భారీ వర్షాలతో చెరువు నిండు కుండలా ఉంది… అంతేకాకుండా వీరికి ఈత రాకపోవడంతో మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుస్తులు, గుర్తింపు కార్డుల ఆధారంగా మృతి చెందినవారికి గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.