Hyd: ఉచిత తాగునీటి పథకం గ‌డువు ఆగష్టు 15 వర‌కు పొడిగింపు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): జీహెచ్ఎంసి పరిధిలోని ప్ర‌జ‌లు నెలకు ఇరవై వేల లీట‌ర్ల‌ వరకు ఉచిత తాగునీటి పథకం గడువు గత ఏప్రిల్ మాసంలోనే ముగిసినప్పటికీ.. మరొకసారి ఈ పథకాన్ని పొందేందుకు ప్రభుత్వం ఆగష్టు 15 వరకు పొడిగించిందని జలమండలి ఎండీ ఎం. దాన కిశోర్ వెల్ల‌డించారు. ఉచిత తాగునీటి పథకం అమలు, పురోగతి బుధ‌వారం జలమండలి ఎండీ ఎం. దాన కిశోర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జీహెచ్ఎంసి పరిధి లో నివసిస్తున్న వారికి ఇంటింటికీ నెలకు ఇరవై వేల లీట‌ర్ల‌ వరకు ఉచిత తాగునీటి పథకం గడువు గత ఏప్రిల్ మాసంలోనే ముగిసినప్పటికీ.. మరొకసారి ఈ పథకాన్ని పొందేందుకు ప్రభుత్వం ఆగష్టు 15 వ తేది వరకు పొడిగించిందని తెలిపారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతీ ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు.

ఈ ఇరవై వేల లీట‌ర్ల‌ ఉచిత తాగునీటి పథకానికి ఇప్పటి వరకు నమోదు చేసుకోని వినియోగదారులను గుర్తించి.. వారి ఇంటింటికీ వెళ్ళి ఆగష్టు 15 వ తేది లోపు ఈ పథకానికి నమోదు చేసుకుని, రిబేటు పొందేలాగా అవగాహన కల్పించాలని అధికారుల‌ను ఆదేశించారు. ఈ ప‌థ‌కానికి ఆగ‌ష్టు 15 త‌ర్వాత కూడా న‌మోదు చేసుకోవ‌చ్చని, అయితే న‌మోదు చేసుకున్న రోజు నుంచి మాత్ర‌మే రిబేటు వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు.

ఈ ఉచిత తాగునీటి పథకం ప్రజలు సద్వినియోగం చేసుకునేలాగ విస్తృత ప్రచారం క‌ల్పించాల‌ని, ఇందుకోసం ఒక్కో డివిజన్ కు ఒక్కో వ్యూహం అనుసరించి ప్రజలు ఈ పథకాన్ని పొందేందుకు తగిన కసరత్తు చేయాలని సూచించారు. ఈ పథకం ప్రచారంలో క్షేత్ర స్థాయి సిబ్బందితో సహా.. జీఎంలు, డిజీఎంలు, మేనేజర్లు, ఎమ్మేల్యే, కార్పోరేటర్ వంటి ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం ద్వారా ఈ ప‌థ‌కం మరింత ఎక్కువ మందికి చేరువవుతుందని వివరించారు.

 

అలాగే ఈ పథకం గురించి ప్రజల్లో అవగాహన కోసం కరపత్రాలు, పోస్టర్లతో సహా సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్ బుక్ లల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

వినియోగదారులు తమ కనెక్షన్లకు ఆధార్ ను అనుసంధానం చేసుకోవాలంటే తమ దగ్గర్లో ఉన్న మీ-సేవా కేంద్రాల్లో గానీ లేదా వారు నేరుగా జలమండలి వెబ్ సైట్ www.hyderabadwater.gov.inను సందర్శించి అనుసంధానం చేసుకోవచ్చని తెలిపారు. వినియోగదారులు మరింత సమాచారం కోసం జ‌ల‌మండ‌లి కస్టమర్ కేర్ 155313 ని సంప్రదించాలని కోరారు. ఈ స‌మావేశంలో ఈఎన్సీ, డైరెక్ట‌ర్ ఆప‌రేష‌న్స్-1 అజ్మీరా కృష్ణ, రెవెన్యూ డైరెక్ట‌ర్ వి.ఎల్. ప్ర‌వీణ్ కుమార్, డైరెక్ట‌ర్ ఆప‌రేష‌న్స్-2, ఎం.స్వామి ల‌తో పాటు సీజీఎంలు, డీజీఎంలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.