ఇప్పటినుంచి తెరాస అంటే.. తెలంగాణ రైతు సమితి..
బిజెపిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు : మంత్రి కెటిఆర్

సిరిసిల్ల (CLiC2NEWS): బియ్యం ఎగుమతి చేసే అధికారం రాష్ట్రాలకు లేదని.. కేంద్రమే ధాన్యం కొని ఎగుమతి చేయాల్సి ఉందని టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్ అన్నారు. అన్నీ అమ్మాలి.. వడ్లు కొనొద్దనేది బిజెపి విధానమని మంత్రి ఎద్దేవా చేశారు. యాసంగిలో వరి వద్దే వద్దని కేంద్రం ప్రభుత్వం మొండికేసిందని ఆయన ఆక్షేపించారు. కేంద్రం యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనన్న డిమాండ్‌తో సిరిసిల్లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం యాసంగి వడ్లు కొంటామనే దాకా బిజెపి విడిచిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి అన్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఇప్పటి నుంచి టిఆర్ఎస్ అంటే.. తెలంగాణ రైతు సమితి అని కెటిఆర్ స్పష్టం చేశారు. రైతుల ఉత్సాహం చూస్తుంటే మరోసారి తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తోందని మంత్రి వెల్లడించారు. ఉద్యమం నాటి జోష్ మళ్లీ వచ్చింది. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న రైతు వ్యతిరేక విధానాలను ఈ ఏడున్నరేళ్లలో తుడిచి పెట్టగలిగామన్నారు.
మన పథకాలను 11 రాష్ట్రాలు కాపీ కొట్టాయి..
తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. మన రైతుబంధును కేంద్రం సహా 11 రాష్ట్రాలు కాపీ కొట్టాయన్నారు. రైతు చనిపోయిన పది రోజుల్లోపై రైతుబీమా కింద రూ. 5 లక్షలు ఇస్తున్నాము. కేంద్రం మాత్రం వరి వద్దు అంటోంది. పంజాబ్‌కో న్యాయం.. తెలంగాణకు ఓ న్యాయమా..? అని ప్రశ్నించారు. దేశానికి ఒక్క విధానం ఉండనవసరం లేదా? అని అడిగారు.
కాళేశ్వరం ప్రాజెక్టును కాలంతో పోటీ పడి కేసీఆర్ నిర్మించారు. రైతులకు ఏ కష్టం రాకుండా సీఎం కేసీఆర్ చూసుకుంటున్నారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను తెలంగాణ మించిపోయింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు గ్రామాల బాట పట్టి వ్యవసాయం చేస్తున్నారు. దిక్కు మాలిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ వచ్చాక ఆత్మహత్యలు తగ్గాయని పార్లమెంట్ సాక్షిగా మోడీ ప్రభుత్వమే చెప్పింది అని మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు.
అన్నారు.