హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనం. 19న ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ (CLiC2NEWS): గ‌ణేశ్ నిమజ్జనోత్సవానికి సర్వం సన్నద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. లక్షలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొంటారని, సుమారు 320 కిలోమీటర్ల మేర గణేష్‌ శోభాయాత్ర జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ సంద‌ర్భంగా రేపు (ఆదివారం) ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఎవరికైనా సందేహాలుంటే 040-27852482, 9490598985, 9010303626 నంబర్లలో సంప్రథించవచ్చని అధికారులు తెలిపారు.

గణేశుని విగ్రహాలను తరలించే వాహనాలకు ప్రత్యేకంగా కలర్‌ కోడింగ్ ఏర్పాటు చేశారు. దీని ఆధారంగా ట్రాఫిక్‌ పోలీసులు రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. ట్రాఫిక్‌ రద్దీని గూగుల్‌ మ్యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయనున్నారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు పూర్తిచేసింది.

నిమజ్జనం నేపథ్యంలో నగరంలో పలుచోట్ల ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. అదేవిధంగా జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసి బస్సులను నగర శివార్లకే పరిమితం కానున్నాయి. నల్లగొండ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎల్బీనగర్‌, వరంగల్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు ఉప్పల్‌, దేవరకొండ నుంచి వచ్చే వాహనాలు సాగర్‌ రింగ్‌రోడ్డు, ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి వచ్చే వాహనాలను ఆరాంఘర్‌‌ వద్ద నిలిపివేయనున్నారు. ఇక అంతర్‌ రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై శనివారం అర్థరాత్రి నుంచే నిషేధం విధించనున్నారు.

ప్రత్యేక బస్సులు..
నిమజ్జనం సందర్భంగా భారీగా తరలి రానున్న భక్తజనసందోహం కోసం గ్రేటర్‌ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఆదివారం ఉదయం నుంచి నిమజ్జన వేడుకలు పూర్తయ్యే వరకు 565 ప్రత్యేక బస్సులను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

నిమజ్జన మార్గాల్లో మళ్లింపు..
పాతబస్తీ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు కొనసాగనున్న నిమజ్జన శోభాయాత్ర దృష్ట్యా పాతబస్తీ మీదుగా రాకపోకలు సాగించే బస్సులను అఫ్జల్‌గంజ్‌ వరకే పరిమితం చేస్తారు. సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ మీదుగా వెళ్లే బస్సులు ఇందిరాపార్కు వరకు పరిమితమవుతాయి. ఉప్పల్‌ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే బస్సులు కూడా ఇందిరాపార్కుకే పరిమితమవుతాయి. ప్రత్యేక బస్సులన్నింటికీ ‘గణేశ్‌ నిమజ్జనం స్పెషల్‌’ అనే డెస్టినేషన్‌ బోర్డులను ఏర్పాటు చేస్తారు. అర్ధరాత్రి తరువాత కూడా ఈ బస్సులు తిరుగుతాయి.

  • గణేశ్‌ శోభాయాత్ర మార్గంలో 38 ఫైర్‌ వాహనాలు
  • సరూర్‌నగర్, కాప్రా, ప్రగతినగర్‌ చెరువుల వద్ద బోట్లు
  • టూరిజం శాఖ ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు 3 బోట్లు, నెక్లెస్‌రోడ్‌ వైపు 2 బోట్లు , వీటితోపాటు 4 స్పీడ్‌బోట్లు. 10 మంది గజ ఈతగాళ్లు
  • హుస్సేన్‌సాగర్‌ చుట్లూ 48 ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు.
  • సరూర్‌నగర్‌ చెరువు వద్ద 5 ట్రాన్స్‌ఫార్మర్లు..వీటితో సహా వివిధ ప్రాంతాల్లో మొత్తం 101 ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు రూ. 1.52 కోట్లతో 41284 తాత్కాలిక లైటింగ్‌ ఏర్పాట్లు.
Leave A Reply

Your email address will not be published.