టీచర్ల ఆస్తులపై విద్యాశాఖ ఉత్తర్వులు రద్దు
హైదరాబాద్ (CLiC2NEWS): ఉపాధ్యాయుల ఆస్తులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. విద్యాశాఖ పరిధిలో పనిచేసే టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. జూన్ 8వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులు శనివారం వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుండి రాష్ట్రంలోని ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. కేవలం ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం ఈ విధంగా చేస్తోందని విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈమేరకు ఒక సర్క్యులర్ కూడా జారీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.