AP: మెట్రోరైలు ప్రాజెక్టు మొదటి దశ డీపీఆర్‌కు ప్రభుత్వ ఆమోదం

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎపిలోని విజ‌య‌వాడ‌, విశాఖ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త. ఈ రెండు న‌గ‌రాల్లో త్వర‌లో మెట్రో రైలు ప్రాజెక్ట్ ప‌నులు ప్రారంభంకానున్నాయి. విజ‌య‌వాడ‌, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు మొద‌టి ద‌శ డిపిఆర్‌ను రాష్ట్ర స‌ర్కార్ ఆమోదించింది. మెట్రో రైల్ కార్పొరేష‌న్ విశాఖ‌, విజ‌య‌వాడ న‌గ‌రాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టుల‌కు సంబంధించిన డిపిఆర్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించ‌గా.. పుర‌పాల‌క శాఖ ఆమోదం తెలుపుతూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టుల‌ను కేంద్ర ప్ర‌భుత్వ నిధుల‌తోనే నిర్మించాల‌ని ప్ర‌భుత్వం తీర్మానం చేసింది.
విశాఖ‌లో తొలి ద‌శ‌లో 46.23 కిలో మీట‌ర్ల మేర మూడు కారిడార్లు.. రెండో ద‌శ‌లో కొమ్మాది నుండి భోగాపురం విమానాశ్ర‌యం వ‌ర‌కు 30.67 కిలోమీట‌ర్ల మేర నిర్మించ‌నున్న‌ట్లు స‌మాచారం.

తొలిద‌శ మెట్రో నిర్మాణానికి రూ. 11,498 కోట్లు వ్య‌యం అవుతుంద‌ని అంచ‌నా వేశారు. తొలిద‌శ‌లో విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది వ‌ర‌కు 34.4 కిలోమీట‌ర‌ల్ మేర ఒక‌టో కారిడార్‌.. గురుద్వార్ నుండి పాత పోస్టాఫీస్ వ‌ర‌కు 5.08 కిలోమీట‌ర్ల మేర రెండో కారిడార్‌, తాటిచెట్ల పాలెం నుండి చిన‌వాల్తేరు వ‌ర‌కు 6.75 కిలోమీట‌ర్ల వ‌ర‌కు మూడో కారిడార్ నిర్మాణం జ‌రుగనుంది.

విజ‌య‌వాడ‌లో మెట్రోరైలు ప్రాజెక్టు రెండు ద‌శ‌ల‌లో 38.4 కిలోమీట‌ర్ల మేర నిర్మాణం జ‌ర‌పాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనికి మొత్తంగా రూ.11,009 కోట్ల మేర రెండు ద‌శ‌ల్లో( కారిడార్ 1ఎ, 1బి) నిర్మించాల‌ని భావిస్తోంది. మెట్రో నిర్మాణానికి రూ.1152 కోట్ల భూసేక‌ర‌ణ ఖ‌ర్చు అవుతుంద‌ని అంచానా వేశారు. ఈ ఖ‌ర్చు రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించేలా డిపిఆర్‌ను సిద్ధం చేశారు. రెండో ద‌శ‌లో భాగంగా మూడో కారిడార్‌ను 27.75 కిలోమీట‌ర్ల మేర నిర్మించాల‌ని నిర్ణ‌యించారు.

కారిడార్ 1ఎ.. గ‌న్న‌వ‌రం నుండి పండిట్ నెహ్రూ బ‌స్టాండ్
కారిడార్ 1బి.. పండిట్ నెహ్రూ బ‌స్టాండ్ నుండి పెన‌మ‌లూరు
మూడో కారిడార్‌.. పండిట్ నెహ్రూ బ‌స్టాండ్ నుండి అమ‌రావ‌తి వ‌ర‌కు

Leave A Reply

Your email address will not be published.