జంతువల దాడి కేసులో ప్రభుత్వం పరిహారం చెల్లించాలి: హైకోర్టు
ఒక్కో పంటిగాటుకి రూ. 10వేలు..
ఛండీగర్ (CLiC2NEWS): వీధుల్లో ఎక్కడ చూసినా వీధికుక్కల బెడద ఎక్కువగా ఉంది. పిల్లలు వీధుల్లో నడవాలంటే భయపడుతున్నారు. ఎంతో మంది చిన్నారులు శునకాల దాడికి బలవుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ సమస్యతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పంజాబ్ హరియాణా హైకోర్టులో వీధుల్లో ఉండే మూగజీవాలు దాడులకు సంబంధించి 193 పిటిషన్లు దాఖలైయ్యాయి. వీటిని విచారించిన న్యాయస్థానం.. వీధి శునకాల, ఇతర జంతువుల దాడి కేసులో పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తీర్పు వెలువరించింది. కుక్కకాటుకు గురైన వ్యక్తికి ఒక్కో పంటి గాటుకు కనీసం రూ. 10 వేలు చెల్లించాలని, తీవ్ర గాయమైతే (0.2 సెంటీ మీటరు మేర కోతపడినట్లయితే) రూ. 20 వేలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
అవులు, ఎద్దులు, గాడిదలు, శునకాలు, గేదెలతో పాటు అడవి, పెంపుడు జంతువుల దాడుల్లో చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించేందుకు ఓ కమిటీని నియమించాలని న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ పాలనా విభాగాలకు సూచించింది. పరిమారం చెల్లించే బాధ్యత ప్రభుత్వానిదేనని.. వీటిని సంబంధిత ప్రభుత్వ విభాగం లేదా ప్రైవేటు వ్యక్తుల నుండి రికవరీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం తెలిపింది. క్లెయిమ్ దాఖలు చేసిన నాలుగు మాసాల వ్యవధిలో పరిహారాన్ని ఆమోదించాలని పేర్కొంది.