తీరం దాటిన గులాబ్ తుపాను

విశాఖ‌ప‌ట్ట‌ణం (CLiC2NEWS): ఉత్తరాంధ్రకు కునుకు లేకుండా చేసిన గులాబ్‌ తుపాను కొద్ది గంటలు ముందుగానే ఆదివారం రాత్రి కళింగపట్నం–గోపాలపూర్‌ మధ్య తీరం దాటింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. విపత్తు నిర్వహణ శాఖ తుఫాను ప్ర‌భావిత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ఎపి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

గులాబ్‌ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కోస్తాంధ్ర జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

శ్రీకాకుళం జిల్లా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భావనపాడు, నౌపాడ ప్రాంతాల్లో పలు చెట్లు నేల కూలాయి. తుపాను దెబ్బకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విశాఖపట్నం- విజయనగరం- శ్రీకాకుళం వైపు వచ్చే వాహనాలను కూడా నిలిపివేశారు.

గులాబ్ తుఫాన్ పై విశాఖ కేంద్రంగా ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాథ్ దాస్ సమీక్ష నిర్వహించగా, విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సమీక్ష చేపట్టారు. తుపాను తీరం దాటే సమయంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది.

ఏపీ సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌
గులాబ్‌ తుఫాన్‌ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లా డి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం నుంచి ఏ సాయం కావాలన్నా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.