హైదరాబాద్‌లో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర..
హైదరాబాద్ (CLiC2NEWS): హనుమజ్జయంతి సందర్భంగా వీర హనుమాన్ శోభాయాత్ర హైదరాబాద్ నగరంలో ప్రారంభమైంది. గౌలిగూడలోని రామ్ మందిర్ నుంచి సికింద్రాబాద్‌లోని తాడ్బండ్ వరకు 21 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర కొనసాగనుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. విహెచ్‌పి, బజరంగ్‌దళ్ నేతృత్వంలో ఇవాళ (శనివారం) ఉదయం ప్రారంభమైన ఈ శోభాయాత్ర.. రాత్రి 8 గంటలకు ముగియనుంది.
భారీగా జరుగనున్న ఈ శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు తెలంగాణ పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 8000 మందిపోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.
మరోవైపు కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపల్ నుంచి కూడా శోభాయాత్ర ప్రారంభమైంది . ఈ రెండు శోభాయాత్రలు కోఠిలో కలుసుకోనున్నాయి. గౌలిగూడ, కోఠీ, సుల్తాన్ బజార్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్ ఎక్స్‌రోడ్, గాంధీనగర్, కవాడిగూడ, ఆర్పీరోడ్, ప్యారడైజ్ మీదుగా శోభాయాత్ర కొనసాగనుంది.