హెడ్ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య..

మంచిర్యాల (CLiC2NEWS): భర్త వేధింపులకు గురిచేస్తుండటంతో భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో చోటుచేసకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండలం సుద్దాల విలేజ్‌కు చెందిన ఆకుదారి కిష్టయ్యకు.. నస్పూర్ కు చెందిన వనిత (35)కు పదిహేనేళ్ల కిందట పెళ్లయింది. తిర్యాణి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కిష్టయ్య కుటుంబంతో కలిసి నాగార్జున కాలనీ సింగరేణి క్వార్టర్‌లో అద్దెకు నివాసం ఉంటున్నాడు. కాగా వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

కాగా అనుమానంతో భార్య వనితను తరచూ వేధింపులకు గురిచేస్తుండటంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోలైంది. భర్త వేధింపులను భరించలేకపోయింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం పూట ఇంట్లో ఎవరూ లేని సమయంలో వనిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన భర్తకు వనిత ఉరేసుకుని కనిపించడంతో పక్కవారికి చెప్పి అక్కడ నుంచి కిష్టయ్య పరారయ్యాడు.
విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై రవికుమార్ ఘటనా స్థలికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. భర్త వేధింపుల తీరుపై తల్లిదండ్రులకు… తన పిల్లలను ఉద్దేశించి వనిత రాసిన లేఖ పలువురిని కంటతడి పెట్టిస్తోంది.