ఎపిలో భారీ వర్షాలు.. టిటిడి కీలక నిర్ణయాలు

తిరుమల (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కీలక నిర్ణయాలు తీసుకుంది. విపత్తు నిర్వహత ప్రణాళికపై టిటిడి అడిషనల్ ఇఒ సిచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఇఒ శ్యామల రావు వర్చువల్ విధానంలో అధికారులతో సమావేశమయ్యారు. రాగల 36 గంటల్లో భారీ వర్ష సూచనపై ఈ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి ఆలయంలో 15న సిఫార్సు లేఖలు అనుమతించకూడదని, అదేవిధంగా 16వ తేదీన విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
2021లో భారీ కొండ చరియలు వరిగి పడిన ఘటనతో టిటిడి 700 పేజిల విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ ప్రణాళిక మరిత మెరుగు పరచాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ, ఆరోగ్య శాఖ, విజిలెన్స్ విభాగం, ఇతర కీలకమైన శాఖల విభాగాధిపతులు తమ సిబ్బందితో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. ఐటి విభాగం వారు భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాల తయారీ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
వైద్యారోగ్య శాఖ అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుకోవాలని, ఇంజనీరింగ్ విభాగం వారు డ్యామ్ గేట్లను పర్యవేక్షించాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ సిబ్బంది సమన్వయం చేసుకోవాలి. సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ఎస్‌విబిసి, మీడియా, టిటిడి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ భక్తులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు