ఇవాళ అతిభారీ వర్షాలు
హైదరాబాద్ (CLiC2NEWS): జార్ఖండ్‌పై రెండు రోజుల కింద ఏర్పడిన అల్పపీడనం మంగళవారం మధ్యప్రదేశ్‌పైకి విస్తరించింది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. అలాగే బంగాళాఖాతంపై మరో ఉపరితల ఆవర్తనం 4.5 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.