బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
హైదరాబాద్ (CLiC2NEWS): హీరో అల్లు అర్జున్‌కు ఉన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చిక్కడిపల్లి పోలీసులు అతనిపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లుఅర్జున్ హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం పోలీసులు బన్నీ ఇంటికి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
అల్లఅర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. అల్లు అర్జున్ ఎ11గా పేర్కొన్న పోలీసులు.. మధ్యాహ్నం 1.30కి అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. క్వాష్ పిటిషన్‌పై విచారణ అత్యవసరం కాదని, సోమవారం వినాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. బన్నీ అరెస్టయినందున బెయిల్ కోసం అవసరమైతే మరో పిటిషన్ వేసుకోవాలన్నారు. క్వాష్ పిటిషన్లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని బన్నీ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎఫ్ ఐఆర్‌ను పూర్తిగా కొట్టివేయాలని పిటిషన్ వేశామని, పిటిషన్‌పై విచారణ కొనసాగుతుండగానే అరెస్టు చేశారు. ఈ పిటిషన్ ద్వారానే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా షారూక్‌ఖాన్ , బండిసంజయ్, అర్ణబ్ గోస్వామి కేసులను ఉదహరించారు.
రూ.50వేల వ్యక్తి గత పూచీకత్తు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేసు దర్యాప్తును , సాక్షులను ప్రభావితం చేయవద్దని అల్లు అర్జున్ ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును సంప్రదించాలని సూచించింది.