పాఠ‌శాల‌ల్లో ప్ర‌త్య‌క్ష బోధ‌న‌పై హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు

గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై స్టే

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ విద్యా సంస్థ‌ల్లో ప్ర‌త్య‌క్ష బోధ‌న‌పై హైకోర్టు మంగ‌ళ‌వారం మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌త్య‌క్ష బోధ‌న‌పై విద్యార్థుల‌ను బ‌ల‌వంతం చేయొద్ద‌ని ఆదేశించింది. త‌ర‌గ‌తుల‌కు హాజ‌రుకానీ విద్యార్థుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని రాష్ట్ర స‌ర్కార్‌ను ఆదేశించింది. ప్ర‌త్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. ఆన్‌లైన్ లేదా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలే నిర్ణయించుకోవచ్చని తెలిపింది. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేయాలని తెలిపింది. వారంలోగా మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖను ఆదేశించింది.

గురుకులాలు, హాస్ట‌ళ్ల‌లో ప్ర‌త్య‌క్ష బోధ‌న ప్రారంభించ‌వ‌ద్ద‌ని హైకోర్టు ఆదేశించింది.
గురుకులాలు, హాస్ట‌ళ్ల‌ను ఇప్పుడే తెర‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే గురుకులాలు, హాస్టళ్లలో వసతులపై నివేదిక ఇవ్వాలని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ప్రత్యక్ష బోధనపై పరస్పర విరుద్ధ లాభనష్టాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.

సెప్టెంబ‌రు 1వ తేదీ నుంచి పాఠ‌శాల‌లు ప్రారంభించాలంటూ రాష్ట్ర స‌ర్కార్ జారీ చేసిన ఉత్వ‌ర్వుల‌ను కొట్టివేయాల‌ని ఇటీవ‌ల హైకోర్టులో హైద‌రాబాద్‌కు చెందిన ఎం. బాల‌కృష్ణ‌ ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం చేశారు.

బాల‌కృష్ణ దాఖ‌లు చేసిన వ్యాజ్యంపై విచార‌ణ చేప‌ట్టిన ఉన్న‌త న్యాయ‌స్థానం ప్ర‌త్య‌క్ష బోధ‌న‌పై మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. ఆన్‌లైన్ బోధ‌న‌పై విద్యా సంస్థ‌లే నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది.

రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత ఇంకా కొనసాగుతోందని హైకోర్టు తెలిపింది. సెప్టెంబరు లేదా అక్టోబరులో మూడో దశ పొంచి ఉందని హెచ్చరికలు ఉన్నాయని వెల్లడించింది. బడులు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతారన్న అభిప్రాయాలు ఉన్నాయని… ప్రభుత్వం రెండింటిని సమన్వయం చేసి చూడాలని సూచించింది. తదుపరి విచారణను అక్టోబరు 4కి వాయిదా వేసింది.

 

Leave A Reply

Your email address will not be published.