భువనగిరిలో పరువు హత్య కలకలం
భువనగిరి (CLiC2NEWS): భువనగిరి పట్టణంలో పరువు హత్య కలకలం సృష్టించింది. యాద్రి భువనగిరి జిల్లాలో తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడని కక్ష పెంచుకున్న ఓ వీఆర్వో సుపారీ గ్యాంగ్‌తో రూ. 10 లక్షలు ఒప్పుందం చేసుకొని అల్లుడిని మట్టు బెట్టించాడు. భువనగరి ఎసిపి వెంకట్‌రెడ్డి, పట్టణ ఎన్స్పెక్టర్ సత్యనారాయణ ఆదివారం రాత్రి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లికి చెందిన ఎరుకుల రామకృష్ణ పదేళ్ల కిందట హోంగార్డుగా విధుల్లో చేరారు. మొదట్లో వలిగొండలో పని చేసి, తర్వాత యాదగిరి గుట్ట పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు..
అప్పట్లో యాదగిరి గుట్టలో ఉంటూ వీర్వోగా పనిచేస్తున్న గౌరాయిపల్లికి చెందిన పల్లెంపాటి వెంకటేశంతో రామకృష్ణకు పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో రామకృష్ణ తరచూ వెంకటేశం ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు… ఈ క్రమంలో వెంకటేశం కూతురు భార్గవితో రామకృష్ణకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దాంతో రెండేళ్ల కిందట వారిద్దరు వివాహం చేసుకున్నారు. ఆరునెలల కిందట భార్గవి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా వీరు పది నెలల కిందట భువనగిరికి మాకాం మార్చారు.
కాగా అల్లుడిపై కక్ష పెంచుకున్న వెంకటేశ్ పెళ్లయిన కొత్తలోనే రామకృష్ణు మట్టుబెట్టేందకు యత్నించాడు. తన ఆస్తిలో వాటా కోసం కోర్టులో కేసు వేస్తానని కుమార్తె అంటుండడంతో అల్లుడిని హత్య చేయించాడు.
హత్యకు కుట్ర వివరాలు..
రామకృష్ణపై కక్ష పెంచుకున్న వెంకటేశం కొద్ది రోజుల కిందటే అల్లుడిని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. సిద్దిపేటకు చెందిన లతీష్ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. దీనికోసం అడ్వాన్స్‌గా రూ. 6 లక్షలు చెల్లించాడు. ఈనేపథ్యంలో శుక్రవారం ఉదయం రామకృష్ణ ఇంటికి లతీఫ్, అమృతయ్య వచ్చారు. తమకు భూములు చూపించాలని అడిగి అతన్ని వెంట తీసుకుని వెళ్లారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం.. రామకృష్ణను అమృతయ్య గుండాల మండలంలోని నిమ్మతోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ వేచి ఉన్న హంతకులు కల్లుగీత కత్తి, సుత్తితో రమకృష్ణను దారుణంగా కొట్టి హత్య చేశారని ఎసిపి తెలిపారు. హత్యలో పాల్గొన్న లతీఫ్, అతని భార్య దివ్య, అప్సర్, మహేష్‌లు రామకృష్ణ మృతదేహాన్ని బస్తాలో మూటకట్టి కారులో సిద్దిపేటకు తరలించారు. ఆ రాత్రి మృతదేహం సహా కారును లతీఫ్ ఇంటిముందు ఉంచారు. తెల్లవారి శనివారం 4 గంటలకు లకుడారం వద్ద పాతిపెట్టారు. అమృతయ్య ఇచ్చిన సమాచారం మేరకు లతీఫ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడని ఎసిపి మీడియాకు తెలిపారు. హత్యలో మొత్తం 11 మంది పాల్గొన్నారని వెల్లడించారు. ఈ కేసులో లతీఫ్, దివ్య, అప్సర్, మహేష్‌లను అదుపులోకి తీసుకున్నామని మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా రామకృష్ణ మరణ వార్త విన్న అతడి భార్య భార్గవి, తల్లి కళమ్మ, ఇతర కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. భార్గవి రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.