విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-20)

తప్పకుండా వస్తాను కానీ ఇప్పటికే చాలాసార్లు మీ ఆతిధ్యం తీసుకున్నా. తర్వాత పిలవండి వస్తానంటూ నవ్వాడు. ఆమె కూడా విజయ్ నవ్వును పంచుకుంది. ఆ రోజుకు విజయ్ ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోలేదు. పిఎను పిలిచి పనిఏమీ లేదు వెళ్లిపో. మీ ఆవిడకు సహాయంగా ఉంటుందని వస్తున్న నవ్వును ఆపుకుంటూ విజయ్ చెప్పడంతో ఎప్పుడెప్పుడు సార్ ఈ మాట చెబుతారని వేచి ఉన్న నగేష్ థాంక్స్ సార్ అంటూ బయలు దేరారు. నా ప్రేమ కథ చెప్పడం తో మంచే జరుగుతున్నదని అనుకున్నాడు. ఎంతైనా సార్ గ్రేట్.. ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్రంలో మా సార్‌కే ప్రజల్లో మంచి పలుకుబడి ఉంది. ఏమంటావు అంటూ భార్యను అడిగాడు. అవును మా టీచర్ల సర్కిల్‌లోనూ ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు. ఇంకా కొందరైతే మీ సారే సిఎం అయితే రాష్ట్రం అన్ని విధాలుగా బాగుపడుతుందని చెప్పుకుంటున్నారని నళిని అంది.

మంచి మాట అన్నావు. నేను తిరిగే చోట్ల కూడా ఇదే మాట. ఎంఎల్‌ఎ క్వార్టర్‌లో ఇతర శాసనసభ్యులకు లేని పలుకుబడి మా సార్‌కే ఉంది, తెలుసా. ఎక్కువ మంది మా సార్ దగ్గరేక వస్తారు. ఇతరుల పిఎలకు నేనంటే అసూయ. అంతమంది వస్తున్నారు కదా నాకు వారి నుంచి దక్షిణలు అందుతున్నాయని వారి బాధ. సార్ దగ్గరకు వచ్చే వాళ్లందరూ ఏదో సమస్యపై వస్తారు. వారి వద్దనే ఏమి ఉండదు నాకేమి ఇస్తారంటే వారు నమ్మరు. అయినా నేను ఆశించను.

ఆయన దగ్గర పనిచేసినన్ని రోజులు ఎవరి వద్ద చేయి చాచవద్దని ఎప్పుడో నిర్ణయించుకున్నా. మనం ఇద్దరం జాబ్ చేస్తున్నాం. ఎవరినో పీఢించే పనులు వద్దు. మాసార్ లాగా నిజాయితీగా ఉండాలనే నేను నిర్ణయించుకున్నా.

మంచిగా ఆలోచించావు. కొందరమైనా మంచిగా లేకపోతే సమాజం ఎక్కడికి పోతుంది. నేను పిల్లలకు ఇదే బోధిస్తుంటాను. ఇతర విషయాల్లో ఎలాగున్నా..ఈ విషయంలో మిమ్ములను అభినంధిస్తున్నా అనడంతో నళినిని చుట్టేశాడు పిఎ. చాల్లే సంబడం అంటూ భర్తను వదిలించుకుంటూ పనిలో నిమగ్నమైంది నళిని.

ఒంటరిగా కూర్చున్న విజయ్‌కు ఢిల్లీ ప్రమాదమే గుర్తుకువస్తున్నది. ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడినానో కదా.. ఆస్పత్రుల్లో ఎవరు చేర్చారో ఎన్ని రోజులు కోమాలో ఉన్నానో, ఎలా అంబులెన్స్‌లోకి చేరానో.. తిరిగి ప్రాణాలతో ఎలా లాడ్జీకి చేరానో అంతా మిష్టరీ కదా.. ఇంతలో విరంచి పై ఆలోచనలు మళ్లాయి. ఆమె మరోసారి ఇంటికి ఆహ్వానించినా పోవడానికి మనస్సు అంగీకరించడం లేదు. ఉచితంగా తినడానికి అలవాటు పడినాడని, పిలిస్తే వచ్చేయడమేనా అని వారి కుటుంబసభ్యులు మనస్సులో అయినా అనుకుంటారేమో. వెళ్లవద్దు కానీ ఆమెను చూడాలనిపిస్తున్నది ఎందుకో.. అనుకోగానే ఒక ఆలోచన తట్టింది. వెంటనే ఫోన్ తీసుకొని కాల్ చేశాడు.

నమస్కారం సార్, ఇప్పుడే నా జీతభత్యాలు బ్యాంక్‌లో క్రెడిట్ అయినట్లుగా మెసేజీ వచ్చింది. ప్రతిసారి మీ ఇంటికి వస్తున్నాను. మిమ్ముల్లందరినీ నా ఇంటికి పిలవాలంటే ఇక్కడ అంతబాగా వంటలు తయారు చేసే వారు లేరని మీకు తెలుసు. అందుకే రేపు సాయంత్రం మీ ఇంటికి వస్తాను. అక్కడ నుంచి అటే మంచి హోటల్‌కు వెళ్లి అందరం కలిసి భోజనం చేద్దాం. పాపం ఆడవాళ్లు ఎప్పుడు ఇంటిలోనే కదా. అలా సరదాగా బయట తిరిగినట్లు అవుతుంది. ముఖ్యంగా మీ సతీమణి కంటూ నవ్వాడు విజయ్. దీనికి కుటుంబరావు బదులిస్తూ..

ఒక్క సారి హోటల్‌కు వెళ్లడానికి నీ జీతం అంటూ చెప్పాలా విజయ్‌గారు. బిల్లు నీవే కట్టాలని అలా అన్నావా లేక అంటూ ఏదో మాట్లాడుతుండగా, విజయ్ అందుకొని…

అదికాదు సార్ నేను ఒంటరి వాన్ని.. ఖర్చులు ఏమి ఉంటాయి చెప్పండి. ఎంఎల్‌ఎగా జీతం, ఇతరత్రా కలుపుకొని బాగానే జమ అవుతున్నాయి. మూడు సంవత్సరాలుగా ఈ పదవిలో ఉన్నా. అంతకు ముందు కూడా జర్నలిస్టుగా నాకు మంచి జీతమే ఇచ్చేవారు. అమ్మనాన్నలకు అప్పుడు కొంతపంపేవాన్ని. కానీ ఎన్నికల ముందే రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారని చెబుతుండగా ఆయన గొంతు జీరపోయింది.

ఏం చేస్తాం. పిల్లలు వృద్ధి లోకి వచ్చిన తర్వాత వారిని చూసి గర్వపడతారు పేరెంట్స్. నిజంగానే నీ విషయంలో అన్యాయం జరిగింది. వాళ్లే ఉండి ఉంటే నిన్ను ఇలా ఒంటరిగా ఉండనిచ్చే వారా? ఇప్పటికే పెళ్లికి తొందరపెట్టేవాళ్లు కదా అన్నాడు కుటుంబరావు.

సరే నా ప్రపోజల్ ఓకే కదా. రేపు సాయంత్రం మీ ఇంటి వద్ద ఉంటాను. కాఫీ తాగి కొద్దిసేపు మాట్లాడుకొని హోట‌ల్‌కు వెళ్దాం అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేశాడు విజయ్.

ఈ ప్రయత్నం వర్కవుట్ అయిందని ఆనందించాడు… విరంచితో ఎక్కువ సమయం గడిపేందుకే ఈ ప్రతిపాదన చేశాడు విజయ్. మరో ముఖ్యవిషయం కూడా విజయ్ తనంతతానుగా నిర్ణయించుకున్నాడు. మరో ఆరేడు వారాల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అప్పటివరకు మీడియాకు దూరంగా ఉండాలి. మొన్నటి డోస్‌తో మంత్రులకు దిమ్మతిరిగి ఉంటుంది. ఇక నాజోలికి రాకపోవచ్చనుకున్నాడు. చూద్దాం అంతవరకు మీడియాతో మాట్లాడకుండా ఉండగలనేమో అని కూడా అనుకున్నాడు.

సచివాలయంలో ఆ రోజు ముఖ్యమైన సమావేశాలు ఏమి లేకపోవడం, విజటర్స్ కూడా తక్కువగా ఉండటంతో ముఖ్యమంత్రి త్వరగా బంగ్లాకు వెళ్లారు. సాయంత్రం భర్త ఇంత త్వరగా రావడంతో అన్నపూర్ణమ్మ ఆశ్చర్యంతోపాటు ఆనందం కలిగింది. తన చేతుల మీదుగా భర్తకు సాయంత్రం కాఫీ ఇచ్చి, అధిక రోజులే అయింది. రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో అసలే తీరిక తక్కువగా ఉంటుండంతో ప్రతి రోజు దాదాపు డిన్నర్ టైంకు మాత్రమే బంగ్లాకు చేరకుంటాడు సిఎం. రాగానే స్నానం చేసి, డైనింగ్ టేబుల్ వద్ద కూర్చోగానే వర్కర్స్ భార్యాభర్తలిద్దరికీ భోజనం వడ్డించేవారు. రోజు ఒక పెగ్ డ్రింక్ తీసుకోవడం కూడా ఆయనకు అలవాటే. భోజనానికి కొంత ముందు అక్కడే కూర్చొని, గ్లాస్‌ను నోటివద్దకు తీసుకొని సిప్ చేస్తూ భార్యతో మాట్లాడేవాడు. ఆరోజు ఆఫీసులో ఏదైనా ప్రత్యేక విషయాటుంటే భార్యతో పంచుకునే వాడు. ఈ వయస్సులో అంత బిజీషెడ్యూల్ అవసరమా,అంటూ ఆమె అనడంతో మనకు వారసులెవరూ లేరు కదా.. రాజకీయాలు అప్పగించడానికి, అంటూ నిర్వేధంలో పడిపోతుంటాడు జానకి రామయ్య.

అయినా ఈ పదవిలో కూర్చొని ఉంటే ఆ కిక్కు వేరోయి.. నీకు అర్థం కాదు. పైగా పదవి వ్యామోహలో శ్రమ అని కూడా అనిపించదు తెలుసా.. అంటూ భార్య ముఖంలోకి ఆనందంగా చూస్తాడు. మీ యిష్టం నేను ఏమి చెప్పగలను.మరి కొంచెం తీసుకోండి అంటూ ఆమె కొసరికొసరి వడ్డించడం రోజూ రాత్రి డైనింగ్ టేబుల్ వద్ద జరిగే మాట ముచ్చట.

అయితే ఆ రోజు కొంత ముందుగా వచ్చిన ముఖ్యమంత్రి తీరికగా కూర్చున్నారు. పిఎలను, అధికారులను కూడా వెళ్లిపోండి. ఈ రోజుకు ఏమి పనిలేదని చెప్పాడు. అయితే కింది భాగంలో ఫోన్లు రిసీవ్ చేసుకునేందుకు ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు. సెక్యూరిటీ సరేసరి. పనివాళ్లు కూడా కిందనే ఉంటారు.బంగ్లాకు లిఫ్టు సదుపాయం కూడా ఉండటంతో ముఖ్యమంత్రి, విజిటర్స్‌ను చూడాలనిపిస్తే తప్ప కిందికి రారు. ఒకరిద్దరు వర్కర్లు మాత్రమే పైన ఉంటారు.

రావోయి టివిలో ఏదైనా సినిమా చూద్దాం… కాఫీ తాగుతూ సిఎం, అన్నపూర్ణను పిలిచారు. బాగుంది వరుస మీరు ముందుగా వస్తున్నట్లుగా కబురు చేసి ఉంటే నేను పనులన్నీ చక్కబెట్టుకొని మీ ముందే కూర్చునేదాన్ని.

వర్కర్లు ఉన్నారు కదా నీకు ఏమి పనులుంటాయి అంటూ ఆశ్యర్యం వ్యక్తం చేశారాయన.

ఆడవాళ్లకు పనులు ఎప్పుడూ ఉంటాయి. మీరు కాఫీ తాగుతూ ఉండండి. ఏమి వంటలు చేయాలో వారికి చెప్పి వస్తానని వెళ్లి రెండు నిమిషాల్లోనే తిరిగి వచ్చింది.

ఏదైనా పాత సినిమా చూద్దామండి.యూట్యూబ్ ఓపెన్ చేయండి అని అన్నపూర్ణమ్మ అనడంతో, అవన్నీ నాకు తెలియదు. చిరంజీవి సినిమా మంచిది సెలక్టు చేసి పెట్టు అని భార్యకు చెప్పాడు సిఎం.

నాకు చిరంజీవి సినిమాలన్నీ ఇష్టమే రెండు మూడు తప్ప, మీకు ఏదీ కావాలో చెప్పండని అనడంతో నాకు సినిమాలు చూసేందుకు ఎంత తీరిక ఉంటుందో నీకు తెలియదా. నీకు నచ్చిన సినిమా ఏదో పెట్టవోయి అంటూ భార్యకు రిమోట్ ఇచ్చాడు.

జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా ఎన్నిసార్లు చూసినా బాగుంటుందండి. శ్రీదేవి ఇంద్రుని కూతురుగా ఎంత అందంగా ఉంటుందో.పైగా ఆమె అభినయనం ఒె మీరు చూడాల్సిందే అనుకుంటూ ఈ సినిమాను క్లిక్ చేసింది.

ఈ లోగా నేను కొంత పుచ్చుకుంటాను సరేనా అన్నాడు సిఎం.

నేను వద్దంటే మీరు ఊరుకుంటారా అనుకుంటూనే, టివిలో వస్తున్న సినిమాను ఆపి ఆ ఏర్పాట్లు చేసింది. తాను కూల్‌డ్రింక్ తెచ్చుకుంది.

ఉండండి, వంట త్వరగా పూర్తి చేసి వారందరినీ వెళ్లిపొమ్మని చెబుతాను. ఈ రోజు మనమే పెట్టుకొని ముచ్చట్లు పెట్టుకుంటూ తిందాం. ఏమంటారు. మన ఇద్దరమే..అని ఆమె చెప్పడంతో తన పెళ్లినాటి విషయాలు జ్ఞప్తికి వచ్చాయి. విస్కీ సిప్ చూస్తూ అద్దె ఇంటిలో మనం ఎన్ని ఆగచాట్లు పడ్డామో గుర్తుందా అన్నపూర్ణ అంటూ గతంలోకి వెళ్లాడు. ప్రయివేట్ ఉద్యోగం, చాలీ చాలని జీతం. ఇప్పుడే పిల్లలు వద్దని మనం అనుకున్నాం. జీవితంలో స్థిరపడిన తర్వాత చూద్దామనుకుంటే ఇలా అయింది మనకు. అన్నీ ఉన్నా, ఇదో లోటు. ఏమి చేద్దాం అని బాధపడిపోయాడు ముఖ్యమంత్రి.

కళ్లు ఒత్తుకుంది అన్నపూర్ణమ్మ. అన్ని మీరై అయినన్ను చూసుకుంటున్నారు. ఏలోటు లేదు నాకు కానీ అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంది. ఇద్దరి మధ్య మౌనం. సినిమా చూడాలనే ధ్యాస లేదు. శూన్యంలోకి చూస్తూ ఉన్నారు. మాటలే కరువయ్యాయి. అలా ఎంతసేపుఉన్నారో తెలియదు. వంట పూర్తి అయిందమ్మా. అన్నీ డైనింగ్ టేబుల్‌పై పెట్టాం. అని వర్కర్స్ చెబితే కానీ వారు లోకంలోకి రాలేదు… అందరూ వెళ్లండి. మేం పెట్టుకొని తింటాం ఈ రోజు అని వారికి సెలవు ఇచ్చింది అన్నపూర్ణ… అయ్యో సినిమా సంగతే మర్చిపోయాం మనం. అంటూ తిరిగి బటన్ నొక్కడంతో, సినిమా అక్కడ నుంచి ప్రారంభమైంది. ఇది కూడా సిఎం జానకి రామయ్యకు కొంత ఆశ్యర్యంగానే తోచింది.

టివిని ఎక్కడైనా ఆపి తిరిగి అక్కడ నుంచి సినిమా చూడవచ్చన్న మాట. మన టీవిలో ఇలాంటి సదుపాయం కూడా ఉందా…బాగానే నేర్చుకున్నావే. టెక్నికల్‌గా నువ్వు అభివృద్ది చెందుతున్నావు అంటూ నవ్వడంతో…నా మొఖం నాకు మాత్రం ఏమితెలుసు. మన విజయ్ ఉన్నాడుగా.. .వాడు నేర్పించాడు ఇవన్నీ. కావాలంటే వెనకకు, ముందుకూ మార్చుకోవచ్చండి. ఎలాగో చూపిస్తా అంటూ అటు, ఇటు మార్చింది. విజయ్ వద్ద ఎంతో నేర్చేకున్నట్లుగా సంతోషంగా వివరించింది ఆమె.

విజయ్ ప్రస్తావన రావడంతో ఒక్కసారిగా సిఎం ఉలిక్కిపడ్డాడు. అన్నపూర్ణ మనస్సు ఆయనకు తెలుసు. పిల్లలు లేనందుకు విజయ్‌నే తన స్వంత కొడుడుకు లాగా భావిస్తున్నది. వాడు కూడా అంతే..అమ్మా, అమ్మా అంటూ ఈమె చుట్టే తిరుగుతుంటాడు. ఇంట్లో ఉన్నంత సేపు తల్లీ, కొడుకులు లాగా వారు ఏవేవో మాట్లాడుకుంటారు. విజయ్ వస్తే పాపం ఆమెకు పండుగే. వానికి ఏది ఇష్టమో అవి వంటవాళ్లతో చెప్పి దగ్గరుంచి అన్నీ చేయిస్తుంది. వాడు ఏదైనా తినకుంటే ఊరుకోదు. నీ కోసమే చేయించాను రుచి చూడు, మరి కొంచెం తీసుకో లంటూ నోటికి కూడా అందిస్తుంది. తల్లి మనస్సు కదా.

మనం ఏమి పాపం చేశామో మనకు పిల్లలు కలుగలేదు. విజయ్‌ను చూస్తే ముచ్చటేస్తుందండి అంటున్న ఆమె కన్నుల్లో ఏదో తెలియని అనుభూతి.

అప్పుటికే రెండు పెగ్గులు తీసుకున్న సిఎం, మరో పెగ్గు పోసుకొని, సోడా కలుపుకుంటున్నాడు.

ఏమండి మనం విజయ్‌ను దత్తత తీసుకునేందుకు వీలుంటుందా. చిన్న పిల్లలను అలా తీసుకుంటారు కాదు. ఏమో ఆ అబ్బాయిని చూస్తే ఏదో రక్తసంబంధం కలిగిన వాడుగా ఉంటుంది నాకు. విజయ్‌ను మనం దత్తత తీసుకునే విషయం మీరు అలోచించాలని అంది అన్నపూర్ణమ్మ.దత్తత అనే మాట జానకి రామయ్యకు షాక్‌కు గురిచేసింది. ఏమి సమాధానం ఇవ్వాలో ఆయనకు అంతుచిక్కలేదు.

(సశేషం)

త‌ప్ప‌క‌చ‌ద‌వండి:విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-19)

Leave A Reply

Your email address will not be published.