భర్త అడ్డు వస్తున్నాడని..
![](https://clic2news.com/wp-content/uploads/2021/10/Gadwal-police.jpg)
జోగులాంబ గద్వాల (CLiC2NEWS): అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందో భార్య. ఎసీపీ రంజన్ రతన్ కుమార్ తెలిపిన వివరాల మేరకు..
జిల్లాలోని అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన రాజు అతని భార్య మాధవి గద్వాల మండలం తూర్పుపల్లి గ్రామంలో బత్తాయి తోటలో పని చేస్తున్నారు. కాగా, మాధవికి మక్తల్ మండలం కలవల దొడ్డి గ్రామానికి చెందిన మునేష్‌తో పెండ్లికి ముందు పరిచయం ఉండడంతో అతనితో అక్రమ సంబంధం నెరిపినట్లు ఏసీపీ రంజన్ రతన్ కుమార్ తెలిపారు. గతంలో ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
తన ఆనందానికి అడ్డువస్తున్నాడని ఎలాగైనా భర్తను చంపాలని మాధవి నిర్ణయించుకుంది. ఈ విషయం తన ప్రియుడు మునేష్‌కు తెలియజేసింది. ఆ తర్వాత ఈ నెల 2న హత్యకు వేసుకున్న ప్లాన్ ప్రకారం భార్య మాధవి రాజుకు అన్నంలో మత్తు ట్యాబ్లెట్లు కలిపి వడ్డించింది. అది తిన్న రాజు మత్తు లోకి జారుకోగానే ప్రియుడితో పాటు అతని మిత్రులు కుంటి జైపాల్, బోయ రవి, రవీంద్ర గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండాచేసి హత్య చేశారు. తరువాత దీన్ని ప్రమాదంగా చిత్రీకరించడంలో భాగంగా.. రాజు శవాన్ని పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర పడేసి వెళ్లారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. మాధవిని అదుపులోకి తీసుకొని విచారించగా భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించినట్లు ఏసీపీ రంజన్ తెలిపారు.