విజయదశమి తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక
బెంగాల్, ఒడిశాల్లో సెప్టెంబర్ 30న ఉపఎన్నికలు
న్యూఢిల్లీ (CLiC2NEWS): తెలంగాణలో అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. విజయ దశమి తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నకలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పండుగలు ముగిశాకే ఉప ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సర్కర్ కోరిందని తెలిపింది. అక్టోబరు, లేదా నవంబరులో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కోరిందని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ ఉప ఎన్నిక కూడా దసరా తర్వాతే ఉండనున్నట్లు తెలిపింది. ఎపి సర్కార్ కూడా ఉప ఎన్నికను వాయిదా వేయాలని కోరినట్లు ఇసి వెల్లడించింది.
ఉపఎన్నికల నిర్వహణకు ఆయా రాష్ట్రాల అభిప్రాయం మేరకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
దేశంలోని 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగాల్సి ఉంది.. కాగా ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కరోనా మహమ్మారి ప్రభావం, పండుగల నేపథ్యంలో ఉపఎన్నికల నిర్వహణపై విముఖత వ్యక్తం చేస్తూ ఈసీకి లేఖలు రాశారు. పండుగల సీజన్ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సలహా ఇచ్చారు.
అదే సమయంలో పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలు మాత్రం తమ రాష్ట్రాల్లో మహమ్మారి కంట్రోల్‌లో ఉన్నదని, ఎన్నికలకు తాము సిద్ధమేనని తెలిపాయి.
బెంగాల్, ఒడిశాలో ఉప ఎన్నికలు నిర్వహణకు ఇసి నిర్ణయం
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి అభ్యర్థనను కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు అంగీకరించింది. బెంగాల్‌లో మమతాబెనర్జి బరిలో దిగాలని భావిస్తున్న భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి సెప్టెంబర్ 30న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా బెంగాల్లోని షంషేర్‌గంజ్, జాంగీర్‌పూర్ అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలోని పిప్లీ అసెంబ్లీ స్థానానికి కూడా సెప్టెంబర్ 30న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఎన్నికల సంఘం పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించింది.