సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ‌హ‌త్య‌.. ప్రేమ వ్య‌వ‌హార‌మే కార‌ణ‌మా?

హైద‌రాబాద్ (CLiC2NEWS): సంగారెడ్డి జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నారాయ‌ణ‌రెడ్డి(25) హ‌త్య‌కు గురుయ్యారు.
నారాయ‌ణ‌రెడ్డిని గొంతు నులిమి హ‌త‌మార్చి జిన్నారం అట‌వీ ప్రాంతంలో పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టిన‌ట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. హైద‌రాబాద్‌లోని కెపిహెచ్ కాల‌నీ రోడ్డు నంబ‌ర్‌1లో నారాయ‌ణ‌రెడ్డి త‌న స్నేహితుడితో క‌లిసి నివ‌సిస్తున్నారు. సంవ‌త్స‌రం క్రితం ఓ యువ‌తిని నారాయ‌ణ‌రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి ఇష్టం లేని యువ‌తి త‌ల్లిదండ్రులు ఆమెను బ‌లవంతంగా తీసుకువెళ్లిపోయారు. ఆ త‌ర్వాత కూడా యువ‌తి, నారాయ‌ణ‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడుకుంటున్న‌ట్లు గుర్తించిన త‌ల్లిదండ్రులు, బంధువులు.. అత‌డిని హ‌త‌మార్చాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో గ‌త కొన్ని రోజులుగా నారాయ‌ణ‌రెడ్డి క‌నిపించ‌క‌పోవ‌డంతో జూన్ 30న కెపిహెచ్ పోలీస్ స్టేష‌న్‌లో మిస్సింగ్ కేసు న‌మోదైంది.

మృతుడి కాల్‌డేటా ఆధారంగా శ్రీ‌నివాస్‌రెడ్డి అనే వ్య‌క్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. శ్రీ‌నివాస్‌రెడ్డితో నారాయ‌ణ‌రెడ్డికి ముందే ప‌రిచ‌యం ఉండ‌టంతో జూన్ 29న వాళ్లిద్ద‌రితో పాటు మ‌రికొంత‌మంతి ఖాజాగూడా వద్ద ఓ వైన్‌షాపులో మ‌ద్యం కొనుగోలు చేసి ఓ చోట తాగారు. అనంత‌రం నారాయ‌ణ‌రెడ్డిని గొంతు నులిమి హ‌త‌మార్చి జిన్నారం అట‌వీ ప్రాంతంలో పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టారు. శ్రీ‌నివాస‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించాగా విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. నిందితుడు చెప్పిన వివ‌రాల మేర‌కు ఘ‌ట‌నాస్థ‌లానికి పోలీసులు వెళ్లి ప‌రిశీలించారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Leave A Reply

Your email address will not be published.