దేశ వ్యాప్తంగా దళిత బంధు అమలు చేసే రోజు వస్తుంది: సిఎం కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): దేశంలో ఉన్న మొత్తం దళిత కుటుంబాలకు దళిత బంధు ఇచ్చే రోజు వస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. నగరంలో 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని శుక్రవారం అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏర్పుటు చేసిన సభలో సిఎం మాట్లాడుతూ.. అంబేడ్కర్ కలలు సాకారం కావాలని .. ఇది విగ్రహం కాదు..విప్లవమని అన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్లు దాటిందని.. ప్రతీ ఏటా అంబేడ్కర్ జయంతిని జరుపుకుంటునే ఉన్నాం. హైదరాబాద్ నడిబొడ్డున విశ్వమానవుడి విశ్వరూపం ప్రతిష్టించుకున్నామని అన్నారు. అంబేడ్కర్ విగ్రహం సమీపంలోనే బుద్ధుడి విగ్రహం, అమర వీరుల స్మారకం ఉన్నాయి. సచివాలయానికి కూడా అంబేడ్కర్ పేరు పెట్టకున్నామన్నారు. అంతే కాకుండా అంబేడ్కర్ పేరిట ఏటా అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు.. దీనికోసం రూ. 51 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం అంబేడ్కర్ జయంతి రోజున ఉత్తమ సేవలందించిన వారికి ప్రభుత్వం తరపున అవార్డు ప్రధానం జరుగుతుందని తెలిపారు. ఈ విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో మన ప్రభుత్వమే వస్తుందని.. ప్రజలు గెలిచే రాజకీయాలు రావాలని సిఎం అన్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 50 వేల మందికి దళిత బంధు అందిందని.. మన ప్రభుత్వం వస్తే దేశంలో ఏటా 25 లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేస్తామని సిఎం అన్నారు.