సిఎం సభకు జనాన్ని తరలించాలి.. ఎమ్మెల్యేకు రూ. 3.60లక్షల టోకరా..
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రభుత్వం కొత్త పథకం ప్రారంభిస్తుందని, ఈ కార్యక్రమానికి సిఎం హాజరవుతున్నారు. జనాన్ని తరలించల్సి ఉంది. దీనికి మొత్తం రూ. 3.60 లక్షలు ఖర్చవుతుందని ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేశాడు. ఇది నిజమని నమ్మిన ఎమ్మెల్యే నగదు ట్రాన్స్‌ఫర్ చేశాడు. డబ్బులు పడగానే నిందితుడు ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. నిందితుడు తోట బాలాజి అలియాస్ మల్లారెడ్డి అలియాస్ దాసరి అనిల్‌కుమార్‌ని హైదరాబాద్ సైబర్ పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యేకు నిందితుడు ఫోన్‌చేసి.. తాను రాష్ట్ర ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శినని పరిచయం చేసుకొన్నాడు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రుణ పథకం ప్రారంభిస్తోందని మొదలు పెట్టాడు. ఈ పథకం గురించి ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పటానికి సభను ఏర్పాటు చేస్తున్నారు. ఆసభకు జనాన్ని సమకూర్చడానికి ఒక్కొక్కరికి రూ. 3,600 చొప్పున మొత్తం రూ. 3.60 లక్షల ఖర్చవుతుందని, డబ్బు పంపించాలని అన్నాడు. అతను చెప్పింది నిజమేనని నమ్మిన ఎమ్మెల్యే అతిని బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేశాడు. అనంతరం నిందితుడి ఫోన్ స్విచ్ఛాఫ్ అవడంతో తనను మోసగించినట్లు ఎమ్మెల్యే గ్రహించాడు. ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. పలు పథకాల పేరుతో ఎపి, తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులను నిందితుడు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడుపై తెలుగు రాష్ట్రాల్లో 37 కేసులు ఉన్నట్లు తెలిపారు.