బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ కేసు.. ప్రధాన నిందితుడు అరెస్టు
హైదరాబాద్ (CLiC2NEWS): ఇటీవల నగరంలో.. నెల్లూరు జిల్లాకు చెందిన ఇంజీనీరింగ్ విద్యార్థులు, సాప్ట్‌వేర్ ఉద్యోగులు కలిపి జరుపుకున్న బర్త్‌డే పార్టీలో డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. గోవా నుండి పార్టీకి డ్రగ్స్ తెచ్చినట్లు గుర్తించారు. ఈ పార్టీలో 33 మంది పాల్గొనగా 12 మందిని అరెస్టు చేశారు. డ్రగ్స్ పరీక్ష నిర్వహించగా ముగ్గురు మాదక ద్రవ్యాలు వినియోగించినట్లు నిర్ధారణయ్యింది.
రేవ్ పార్టీ కోసమే గోవా నుండి డ్రగ్స్ హైదరాబాద్ తీసుకొచ్చినట్లు టిఎస్‌న్యాబ్ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో అరెస్టైన ప్రధాన నిందితులు అశిక్‌యాదవ్, రాజేశ్ గోవాకు చెందిన బాబా అనే వ్యక్తి వద్ద 60 ఎక్సటసీ పిల్స్ కొనుగోలు చేసినట్లు తేల్చారు. దీంతో టిఎస్‌న్యాబ్ బృందం గోవా వెళ్లారు నాలుగు రోజుల పాటు శ్రమించి బాబాను అదుపులోకి తీసుకున్నారు. బాబా అసలు పేరు హనుమంత్‌బాబూ సో దివ్కర్ (50). ఎక్సటసీ పిల్స్ ఒక్కొక్కటి రూ. 1,000-1,200 చొప్పున హైదారబాద్‌లో పెడ్లర్లకు విక్రయిస్తాడు. అతని వద్ద 14 గ్రాముల కొకైన్ కోసం రూ. 1.4 లక్షలు ఫిల్మ్‌నగర్ శాంచురీ పబ్ డిజె ఆపరేటర్ స్వదీప్ ఇచ్చాడు. బాబా దగ్గర డ్రగ్స్ కొనగోలు చేసేవారి జాబితాలో నగరానికి చెందిన 25 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.