ఫిల్మ్ ఫెడరేషన్ వద్ద సినీ కార్మికుల ఆందోళన!
హైదరాబాద్ (CLiC2NEWS): వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు కదం తొక్కారు. జూబ్లిహిల్స్ పరిధిలోని వెంకటగిరిలో ఉన్న ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. నాలుగేళ్లుగా పెంచాల్సిన వేతనాలు పెంచడం లేదని.. చాలీ చాలని జీతాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు చెప్పారు. వేతనాలు, పెంచాల్సినదే అని కార్మికులు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో సినీ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు. సినిమాల చిత్రీకరణలు లేకపోవడంతో ఉపాధి దొరక్క ఆర్ధిక కష్టాల్లో ఉన్నారు. తక్షణమే కార్మిక సంఘాలతో ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేవరకు వేచి చూడొద్దని, సమస్యని రెండు మూడు రోజుల్లో పరిష్కారమవుతుందని ఆశిస్తున్నానని అన్నారు.