హైదరాబాద్ గజగజ..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. చలి తీవ్రత పెరిగి గజగజ వణికిస్తోంది. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.
డిసెంబరు నెలలో ఈ దశాబ్దకాలంలోనే అత్యంత చలి రోజులుగా రికార్డయింది. సెంట్రల్ వర్సిటీలో ఉదయం వేళ అత్యల్పంగా 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంతకు ముందు గతంలో 2015వ సంవత్సరంలో డిసెంబరు 13వ తేదీన హైదరాబాద్లో అతి తక్కువగా 9.5 ఉష్ణోగ్రత రికార్డయింది.
రానున్న మూడు రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఉత్తర, ఈ శాన్య ప్రాంతాల నుంచి వీస్తున్న చలి గాలులతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గాయని అధికారులు వెల్లడించారు.
ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.